
సీఏఏ వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో ఐఐటీ బాంబే తమ విద్యార్ధులకు మార్గదర్శకాలు జారీచేసింది.
ముంబై : దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతున్న క్రమంలో ఎలాంటి దేశ వ్యతిరేక నిరసనల్లో పాలుపంచుకోరాదని ఐఐటీ-బాంబే హాస్టల్ విద్యార్దులకు ఇనిస్టిట్యూట్ విద్యార్థి వ్యవహారాల డీన్ సూచించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాల్లోనూ పాల్గొనరాదని విద్యార్ధులకు పంపిన ఈమెయిల్‌లో కోరిన అధికారులు జాతి వ్యతిరేక కార్యకలాపాలపై పూర్తి వివరణను ఇవ్వలేదు. పౌర చట్టాన్ని వ్యతిరేకిస్తున్న విమర్శకులను కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు జాతి విద్రోహులుగా అభివర్ణిస్తున్న నేపథ్యంలో ఐఐటీ బాంబే డీన్ విద్యార్ధులకు పంపిన ఈమెయిల్ కలకలం రేపింది.
క్యాంపస్‌లో ఎలాంటి ప్రసంగాలు ఇవ్వరాదని, నాటకాలు ప్రదర్శించడం, మ్యూజిక్‌ను ప్లేచేయడం, కరపత్రాలు పంపిణీచేయడం నిషేధించామని లేఖలో పేర్కొన్నారు. ఈమెయిల్‌లో పొందుపరిచిన 15 అంశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. కాగా ఢిల్లీలోని జేఎన్‌యూలో ముసుగు దుండగుల దాడిని నిరసిస్తూ ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద జరిగిన నిరసనల్లో ఐఐటీ-బాంబే విద్యార్ధులు పాల్గొనడం గమనార్హం.