
ఆసుపత్రిలో ముగ్గురు చిన్నారుల మృతి
ఆక్సిజన్ సరఫరాలో లోపమే కారణమంటున్న బంధువులు
మరణాలకు ఇతర కారణాలు ఉన్నాయి: అధికారులు
రాయ్‌పూర్: గోరఖ్‌పూర్ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 60 మందికిపైగా చిన్నారులు మరణించిన సంఘటన మరువకముందే ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లోని ఓ ప్రభుత్వ వైద్యశాలలోనూ ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందారు. డా.బీఆర్ అంబేడ్కర్ స్మారక వైద్యశాలలో ఆదివారం జరిగిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ విచారణకు ఆదేశించారు. ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవడమే పసికందుల మృతికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.
అధికారులు మాత్రం శిశువుల మృతికి ఇతర కారణాలు ఉన్నాయనీ, ఆక్సిజన్ సరఫరాలో ఏ లోపమూ లేదని వాదిస్తున్నారు.ఓ శిశువు తక్కువ బరువుతో పుట్టిందనీ, కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉండటంతో మధ్యాహ్నం 12.30 గంటలకు మరణించిందని వైద్యులు చెప్పారు. మరో ఇద్దరు శిశువుల మృతికి శ్వాసకోస సంబంధ సమస్యలే కారణమన్నారు. మరోవైపు మద్యం సేవించి, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆక్సిజన్ సరఫరా విభాగంలోని రవిచంద్ర అనే ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు.
రిజర్వాయర్‌లో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండటాన్ని సాయంత్రం ఐదు గంటలకు ఓ డాక్టర్ గమనించారనీ, వెంటనే రవిచంద్రను పిలవగా అతను మద్యం తాగి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఆక్సిజన్ సరఫరాలో మాత్రం ఏ ఇబ్బందీ తలెత్తలేదనీ, రిజర్వాయర్‌లో కూడా ఆక్సిజన్ స్థాయి పడిపోవడాన్ని గుర్తించిన 15 నిమిషాల్లోనే సరిచేశారని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి చెప్పారు. కాగా, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చిన్నారులు మరణించారని బంధువులు, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆరోపించారు.