
నీటి కుంటల్లో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి
జిల్లాలోని పెనుమూరు, కలికిరి మండలాల్లో శుక్రవారం నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం
పెనుమూరు/కలికిరి : జిల్లాలోని పెనుమూరు, కలికిరి మండలాల్లో శుక్రవారం నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు పెనుమూరు మండలం గుంటిపల్లె పంచాయతీ యానాది కాలకి చెందిన మీన, మంజుల, అమ్ములు బట్టలు ఉతికేందుకు చార్వాకానిపల్లె సమీపంలో ఉన్న దాసరకుంటకు శుక్రవారం మధ్యాహ్నం వెళ్లారు. బట్టలు ఉతికిన తర్వా త సరదాగా ముగ్గురూ కుంటలో ఈత కొట్టారు. ఈ క్రమంలో అమ్ములు(13) లోతైన ప్రాంతంలోకి వెళ్లి ఈతరాక మునిగిపోయింది. మిగిలిన ఇద్దరు చిన్నారులు గ్రామానికి చేరుకుని గ్రామస్తులకు విషయం తెలపడంతో వారు వచ్చి వెతకగా అప్పటికే అమ్ములు మృతిచెందింది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు శీను, శేషమ్మ బోరున విలపించారు.
అదేవిధంగా కలికిరి మండలంలోని గుట్టపాళెం పంచాయతీ వాడవాండ్లపల్లి నల్లగుట్ట హరిజనవాడకు చెందిన వెండిగంగురాజు కుమారుడు యశ్వంత్(6), ఎస్.గంగురాజు కుమారుడు మునీంద్ర(7) కలికిరిలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో నర్సరీ చదువుతున్నారు. నవరాత్రి సెలవులు కావడంతో ఇళ్ల వద్దే ఉన్నారు. ఇద్దరి తల్లిదండ్రులూ కూలి పనులకు వెళ్లారు. శుక్రవారం మధ్యాహ్నం గ్రామం సమీపంలో ఉన్న నల్లప్పచెరువులో కొందరు యువకులు ఈతకొడుతుండగా చిన్నారులు చూసేందుకు వెళ్లారు. వారు వెళ్లిన అనంతరం చిన్నారులిద్దరూ బట్టలు తీసి గట్టుపై పెట్టి ఈత ఆడేందుకు నీటిలోకి దిగి ఈతరాక పోవడంతో మునిగిపోయారు.
సాయంత్రానికి మృతదేహాలు నీటిలో తేలియాడుతుండడంతో గమనించిన గ్రామస్తులు వాటిని వెలికితీశారు. దీంతో రెండు కుటుంబాల్లోనూ విషాదం అలుముకుంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎంపీటీసీ ఆర్.వెంకటరెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని వ్యక్తం చేశాడు.