చిన్నారుల మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
సాక్షి, రాజోళి (అలంపూర్): స్థానిక శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన ముగ్గురు స్నేహితులు ఆదివారం సెలవు రోజు కావడంతో సమీపంలోని పెద్దవాగు వద్దకు ఆడుకోవడానికి వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షానికి అందులో నీరు చేరింది. సమీపంలో ఉన్న కుంటలూ నిండాయి. ఆదివారం ఉదయం ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారుల్లో కొందరు వెనక్కి రాగా.. శివయ్య (10), సాయి చరణ్ (9), యుగంధర్ (7) మధ్యాహ్నం 12 గంటలకు పెద్దవాగు వద్దే ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. ఈ విషయం తెలియని తల్లిదండ్రులు తమ పిల్లలు కనిపించడం లేదని గ్రామంలో అంతటా వెతికారు.
చివరకు రాత్రి పది గంటలకు వాగు వద్ద ఉన్న ముగ్గురు చిన్నారు చెప్పులను చూసి అనుమానం వచ్చిన స్థానికులు మత్య్సకారులతో గాలించారు. చివరికి మృతదేహాలు బురదలో ఇరుక్కుపోగా వాటిని బయటకు తీశారు. వారిని చూసిన కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు. తల్లిదండ్రులు, స్థానికుల రోదనలతో ఆ ప్రాంతంలో నిండిపోయింది. ప్రతిరోజూ తమ మధ్యనే తిరుగుతూ, తమ పిల్లలతో కలిసి ఆడుకునే ముగ్గురు చిన్నారులు ఆకస్మికంగా మృత్యువాత పడటంతో గ్రామస్తులను కలిచి వేసింది.
కడుపుకోత
ఈ ఘటనలో మృతి చెందిన చిన్నారుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మేమేమి పాపం చేశాం దేవుడా, వారి కి బదులు మమ్మల్ని తీసుకోవచ్చు కదా.. ముక్కు పచ్చలారని పిల్లలను చంపావ్ అని తల్లిదండ్రులు ఏడుస్తున్న తీరు అక్కడి వారిని కలచివేసింది. మాకు ఎందుకు ఇంత కడుపుకోత మిగిలిల్చావ్ అని కన్నీరుమున్నీరయ్యారు.
మూడు ఇళ్లలో కొడుకులే మృతి
ఆదివారం జరిగిన ఘటనతో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతిచెందిన వారు మూడు కుటుంబాల్లో ఒక్కో కుమారుడే కావడంతో తమ వారసుడిని కోల్పోయామని గుండెలవిసేలా రోదించారు. బజారి ఇంటిలో పెద్ద కుమారుడైన శివయ్య మృతి చెందగా వారికి కూతురు ఉంది. వెంకప్పకు ముగ్గురు అమ్మాయిల తర్వాత కుమారుడు సాయిచరణ్ జన్మించగా.. ఈ ఘటనలో ఆ బాబు మృత్యువాతపడ్డాడు. కుర్వ ఎల్లప్ప కుమారుడు యుగందర్ మృతి చెందగా.. కుమార్తె ఉంది. ఇలా మూడు కుటుంబాల్లో ముగ్గురు కుమారులే చనిపోయారు. సంఘటనా స్థలానికి శాంతినగర్ సర్కిల్ సీఐ గురునాయుడు, ఎస్‌ఐ మహేందర్ చేరుకుని కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment