బంగారం ఏ రంగులో ఉంటుందంటే..
పసుపుపచ్చ అని ఠక్కున చెబుతారు
కానీ ఇకపై మాత్రం బంగారం నల్లగా కూడా ఉండొచ్చు!
ఎందుకలా అంటే?
పసుపు పచ్చటి బంగారాన్ని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు నల్లగా మార్చేశారు మరి!
అయ్యో.. అంత విలువైన లోహాన్ని పనికి రాకుండా చేశారా అనుకోవద్దు! అసలు కంటే దానికి ఎక్కువ విలువను రాబడుతున్నారు కాబట్టి... ఫలితంగా భవిష్యత్తులో సముద్రపు నీరు చౌకగా తాగునీరైపోతుంది! సూర్యుడి ఎండతో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఇబ్బడిముబ్బడి అవుతుంది కూడా!
నానో టెక్నాలజీ గురించి మనం చాలాసార్లు విని ఉంటాం. దుస్తులు, కాస్మోటిక్స్‌తోపాటు కొన్ని క్రీడా సామగ్రిలోనూ వాడుతున్నారు. కానీ నానో టెక్నాలజీతో సాధించగల అద్భుతాలతో పోలిస్తే ఇవి చాలా చిన్నస్థాయి ప్రయోజనాలని చెప్పక తప్పదు. అతిసూక్ష్మస్థాయిలో.. కచ్చితంగా చెప్పాలంటే ఒక మిల్లీమీటర్ కంటే 10 లక్షల రెట్లు తక్కువ సైజులో పదార్థాల ధర్మాలు చాలా భిన్నంగా ఉంటాయని నానో టెక్నాలజీ చెబుతుంది. బంగారాన్నే ఉదాహ రణగా తీసుకుందాం. సాధారణ స్థితిలో బంగారం రంగు పసుపుపచ్చగా ఉంటే.. సైజు తగ్గే కొద్దీ రకరకాల రంగుల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్) శాస్త్రవేత్తలు మూడేళ్ల క్రితం కొన్ని ప్రయోగాలు చేపట్టారు. సూర్యరశ్మిని సమర్థంగా ఒడిసిపట్టుకునేందుకు ఉన్న అవకాశాలపై సాగిన ఈ ప్రయోగాల్లో బంగారాన్ని ఉపయోగించారు. నానోస్థాయి బంగారపు అణువుల పరిమాణాన్ని, అణువుల మధ్య ఉన్న అంతరాలను నియం త్రించారు. దీంతో బంగారం కాస్తా నల్లగా మారిపోయింది. మునుపు లేని అనేక లక్షణాలు ఒంటబట్టాయి.
వెలుతురు మొత్తాన్నీ పీల్చేసుకుంటుంది..
నల్ల బంగారానికి అబ్బిన కొత్త లక్షణాల్లో ఒకటి కాంతిని పూర్తిగా శోషించుకోవడం. కాంతి కూడా ఒక రకమైన శక్తి అని, వేడిని పుట్టించవచ్చునని మనకు తెలుసు. నానోస్థాయి బంగారం కంటికి కనిపించే కాంతిలో కొంత భాగాన్ని మాత్రమే శోషించుకో గలిగితే టీఐఎఫ్‌ఆర్ శాస్త్రవేత్తలు తయారు చేసిన నానో బంగారం మాత్రం మొత్తం కాంతిని పీల్చేసుకోగలదు. ఇలా పీల్చేసుకున్న కాంతితో బంగారం బాగా వేడిక్కిపోతుందని, నీటిలో ఉంచితే ఆ వేడిని ఆవిరిగా మార్చి విద్యుదుత్పత్తి చేయవచ్చని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ వివేక్ పొలిశెట్టివార్ ‘సాక్షి’కి తెలిపారు. అంతేకాకుండా వాతావరణంలో ఏటికేడాది పెరిగిపోతున్న కార్బన్ డైఆక్సెడ్‌ను పీల్చేసుకునేందుకు, దానితో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను తయారు చేసేందుకు కూడా ఈ నల్ల బంగారాన్ని వాడవచ్చని ఆయన చెప్పారు. మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ అణుశక్తి విభాగం ఇచ్చిన నిధులతో తాము ఈ ప్రయోగాలను ప్రారంభించామని డాక్టర్ వివేక్ తెలిపారు. నల్ల బంగారంతో ఉన్న మరో అద్భుతమైన ప్రయోజనం నిర్లవణీకరణ (సముద్రపు నీటిలోని లవణాలను తొలగించి మంచినీటిగా మార్చడం) అని తెలిపారు. నిర్లవణీకరణకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పద్ధతుల ఖర్చు బాగా ఎక్కువకాగా నల్ల బంగారంతో చౌకగానే ఉప్పు నీటిని మంచినీటిగా మార్చవచ్చని వివరించారు.
పేటెంట్ కోసం ప్రయత్నాలు..
నల్ల బంగారం తయారీ విధానంపై పేటెంట్ సాధించేందుకు టీఐఎఫ్‌ఆర్ ప్రయత్నాలు చేస్తోంది. నిర్లవణీకరణ, సౌర విద్యుదుత్పత్తితోపాటు ఇంకా అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయని డాక్టర్ వివేక్ తెలిపారు. అయితే ప్రస్తుతానికి దీన్ని వాణిజ్య స్థాయిలో వాడుకునేందుకు కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పారు. కార్బన్ డైఆక్సైడ్‌ను పీల్చేసుకున్న తరువాత నల్ల బంగారం ద్వారా ఉత్పత్తి అయ్యే మీథేన్ (సహజ వాయువు) మోతాదు తక్కువగా ఉండటం దీనికి ఒక కారణమని తెలిపారు. బంగారం లాంటి విలువైన పదార్థాన్ని కాకుండా రాగి, వెండి వంటి ఇతర లోహాలతో కూడా నల్ల బంగారాన్ని పోలిన పదార్థాలను తయారు చేసేందుకు ప్రస్తుతం తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అయితే ఈ లోహాలు బంగారం అంత స్థిరంగా ఉండవని చెప్పారు. మొక్కల మాదిరిగానే నల్ల బంగారం కూడా కార్బన్ డైఆక్సైడ్‌ను పీల్చేసుకొని ఉపయోగకరమైన ఇంధనాలుగా తయారు చేస్తుంది కాబట్టి ఈ టెక్నాలజీతో వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కోవచ్చని వివేక్ అంటున్నారు.
ఎవరీ వివేక్ పోలిశెట్టివార్..?
మహారాష్ట్రలోని ఓ కుగ్రామంలో జన్మించిన వివేక్ బీఎస్సీ పూర్తి చేశారు. అమరావతి యూనివర్సిటీ నుంచి రసాయన శాస్త్రంలో పీజీ చేశాక శివాజీ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ సాధించారు. ఆ తరువాత పోస్ట్ డాక్టోరల్ విద్య కోసం ఫ్రాన్స్‌లోని నేషనల్ సుపీరియర్ డీ చిమీ డి మోంట్‌పెల్లియర్‌లో చేరారు. ఆ తరువాత కొంతకాలం వేర్వేరు దేశాల్లో పనిచేసి మాతృదేశంపై మమకారంతో మళ్లీ భారత్ వచ్చేశారు. ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో రీడర్‌గా చేరారు. వేర్వేరు సైంటిఫిక్ జర్నల్స్‌లో 80 వరకూ పరిశోధన పత్రాలు సమర్పించిన వివేక్ చెప్పే విజయ తారక మంత్రం ‘‘కష్టపడండి.. భిన్నంగా ఆలోచించండి. పుస్తకాల్లో ఏం రాశారు? తాజా పబ్లికేషన్స్‌లో ఏమున్నదన్నది అప్రస్తుతం. వ్యక్తిగత స్థాయిలో విమర్శలకు కుంగిపోవద్దు. అన్ని విమర్శలను మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకునేందుకు ఉపయోగించుకోండి. నేను ఇదే చేస్తున్నా.’’
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment