30 శాతంపైగా పెరిగిన పులుల సంఖ్య
గత కొన్ని సంవత్సరాలుగా తగ్గుతూ వస్తున్న పులుల సంఖ్య ఎట్టకేలకు పెరిగింది. ఏడేళ్ల కింద 1400 ఉన్న పులుల సంఖ్య ప్రస్తుతం 2226 గా నమోదయినట్లు పర్యావరణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. 2010 నుంచి పులుల సంఖ్య 30 శాతంపైగా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పులులలో 70 శాతం భారత్లోనే ఉన్నాయని మంగళవారం పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. 406 పులులతో కర్ణాటక అన్ని రాష్ట్రాలకన్నా ముందజలో ఉంది. ఆ తర్వాత వరుసగా ఉత్తరాఖండ్లో 340, తమిళనాడులో 229, మధ్యప్రదేశ్లో 208, మహారాష్ట్రలో 190, పశ్చిమ బెంగాల్లో 76 పులులు ఉన్నాయి.
వేటగాళ్లు, అక్రమంగా రవాణా చేసే అంతర్జాతీయ ముఠాలు, పులుల నివాస ప్రాంతాల కనుమరుగు లాంటి కారణాల వల్ల గత కొన్నేళ్లుగా పులుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది. 20శతాబ్దం ప్రారంభంలో దాదాపు లక్ష పులులు ఉండగా 2008 సంవత్సరంలో ఈ సంఖ్య 1411కి పడిపోయింది. 2004లో పులుల సందర్శనకి పేరొందిన సరిస్కా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఒక్క పులి కూడా లేదని తెలుసుకున్న పర్యావరణ వేత్తలు ఆందోళనకి గురయ్యారు. ఈ సంక్షోభం నుంచి బయట పడడానికి పులుల పరిరక్షణ కోసం అప్పటి నుంచి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.