వీరప్పన్ వద్ద బందీగా రాజ్‌కుమార్ (ఫైల్)
సాక్షి ప్రతినిధి, చెన్నై: కన్నడ సూపర్‌స్టార్ దివంగత రాజ్‌కుమార్‌ను ఎర్రచందన స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేసిన కేసులో నిందితులందరినీ కోర్టు నిర్దోషులుగా తేల్చింది. దాదాపు 18 ఏళ్లుగా ఈ కేసును కోర్టు విచారిస్తోంది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాళయం కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. నేరం నిరూపితం కాకపోవడం, నేరాన్ని రుజువు చేసే సరైన సాక్ష్యాలు లేకపోవడంతో వారందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.
2000 జూలై 30న ఈరోడ్ జిల్లా తొట్టకాజనూరులోని రిసార్టుకు భార్య పార్వతమ్మాళ్‌తో కలసివచ్చిన రాజ్‌కుమార్‌ను ఆరోజు రాత్రి వీరప్పన్ తన సహచరులతో కలసి కిడ్నాప్ చేశాడు. దీంతో వీరప్పన్, అతని అనుచరులు 14 మందిపై కేసు నమోదైంది. తమిళనాడు జర్నలిస్టు నక్కీరన్ గోపాల్‌సహా పలువురు సాగించిన రాయబారాల ఫలితంగా 107 రోజుల తర్వాత రాజ్‌కుమార్ విడుదలయ్యాడు. అయితే, 2004 అక్టోబర్‌లో పోలీస్ ఎన్‌కౌంటర్‌లో వీరప్పన్, అతని అనుచరులు గోవిందన్, చంద్రగౌడ తదితరులు హతమయ్యా రు. 2006లో రాజ్‌కుమార్, గత ఏడాది ఆయన భార్య కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment