దినకరన్ వర్గానికి మూడోసారి నోటీసులు
సాక్షి, చెన్నై: అసలైన అన్నాడీఎంకే పార్టీ తమదేనంటూ వాదిస్తున్న టీవీవీ దినకరన్ వర్గానికి పళని స్వామి ప్రభుత్వం మరో ఝలక్ ఇచ్చింది. శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ ధన్‌పాల్ మూడోసారి దినకరన్ వర్గానికి నోటీసులు జారీ చేశారు. ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.
19 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటిస్తూ గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసి లేఖ సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడటంతో ఆగష్టు 24న ఒకసారి, సెప్టెంబర్ 1 మరోసారి స్పీకర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇక గురువారం మరోసారి తన మద్ధతుదారు ఎమ్మెల్యేలను వెంటపెట్టుకుని దినకరన్ గవర్నర్ ను కలిసిన నేపథ్యంలో స్పీకర్ మరోమారు నోటీసులు పంపించారు. సెప్టెంబర్ 14న ముందు హాజరై వివరణ ఇవ్వాలని స్పీకర్ 19 మంది ఎమ్మెల్యేలను ఆదేశించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎందుకు చేస్తున్నారు, అధికారంలో ఉన్న సొంత పార్టీ ప్రభుత్వం మీద ఎందుకు తిరుగుబాటు చేశారు ? అన్న ప్రశ్నలకు వాళ్లు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
తన వర్గ ఎమ్మెల్యేలు చేజారకుండా దినకరన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం వారిని పాండిచ్చేరి నుంచి మైసూర్ తరలించేందుకు సిద్ధమైపోతున్నాడు. ప్రస్తుతం పళని బలం 115కు చేరింది. బలపరీక్షలో గెలవాలంటే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అవసరం. ఈ నేపథ్యంలో అరవ రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి.