ఉద్యోగం రాలేదని.. విమానం తయారుచేశాడు!
ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం కంటే కష్టమైన పని వేరే ఏదీ లేదంటే ఒప్పుకొని తీరాల్సిందే. చేతిలో డిగ్రీ పట్టాలతో రోడ్లపై తిరుగుతోన్న నిరుద్యోగుల పాట్లు అలా ఉన్నాయి మరి. దేశంలోని సగటు నిరుద్యోగి పరిస్థితే ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల అబ్దుల్ వాజిద్‌కూ ఎదురైంది. కోరుకున్న రంగంలో ఉద్యోగం లేక, దొరికిన ఏదో ఒక పని చేయలేక.. నరకం చూశాడు. తనకు ఆసక్తి ఉన్న రంగంలోని సంస్థల ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. కానీ, ఎక్కడా తిరస్కారమే ఎదురైంది. దీంతో వాజిద్‌లో కసి పెరిగింది. తనను తిరస్కరించినవారికి తానంటే ఏమిటో చూపించాలనుకున్నాడు. అంతే.. ఓ విమానం తయారు చేసేసి, అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశాడు.
ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా కాసెర్వా గ్రామానికి చెందిన వాజిద్, స్వగ్రామంలోనే ఇంటర్ వరకూ చదువుకున్నాడు. తర్వాత గ్య్రాడ్యుయేషన్ కోసం ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్లాడు. అక్కడ ఎన్‌సీసీలో చేరి, తరచూ క్యాంపులకు వెళ్లేవాడు. అలా ఓ క్యాంపులో ఎయిర్ ఫోర్స్‌ను సందర్శించాడు. అప్పుడే విమానాలపై మొట్టమొదటిసారిగా ఆసక్తి పెంచుకున్నాడు వాజిద్. ఎన్‌సీసీ ట్రైనింగ్‌లో ఎంతో శ్రమించి, ఎయిర్ ఫోర్స్ విభాగం నుంచి ‘సి’ సర్టిఫికెట్ కూడా సంపాదించాడు.
తర్వాత, న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ విమానాశ్రయంలో ‘ఏరో మోడలింగ్’లో శిక్షణ పొందే అవకాశం కూడా దక్కించుకున్నాడు. ఇక్కడ నేర్చుకున్న విషయాలు అతడికి విమానయాన రంగంపై మరింత ఆసక్తిని కలిగించాయి. ఎలాగైనా విమాన తయారీ రంగంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. డిగ్రీ పూర్తి చేసుకున్నాక, ఉద్యోగం కోసం సంస్థల చుట్టూ తిరిగాడు. కానీ, ఎవరూ వాజిద్‌కు ఉద్యోగమిచ్చేందుకు ముందుకు రాలేదు.
దీంతో తానే స్వయంగా విమానం తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఇందుకు చాలా ఖర్చవుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులకు విషయం చెప్పి చూశాడు. మొదట్లో ఎవరూ వాజిద్ మాటలను సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, వాజిద్ పాత సామాన్లను కొనుగోలు చేసి, విమాన భాగాలుగా మార్చుతుంటే వారికీ నమ్మకం కుదిరింది. తలా కొంత మొత్తం పోగు చేసి, ఐదు లక్షల రూపాయల వరకూ అతడి చేతిలో పెట్టారు. వీటితో ఓ పాత మారుతీ వ్యాన్‌ను కొన్నాడు వాజిద్. దాని ఇంజిన్‌ను విమానంలో అమర్చాడు.
25 లీటర్ల ఇంధన సామర్థ్యమున్న ట్యాంకర్‌ని ఏర్పాటు చేశాడు. చెక్క, పాత ఇనుప సామానుతో తయారు చేసిన బాడీ పైభాగంలో స్టీలు పూత పూశాడు. మొత్తంగా 350 కిలోల బరువైన విమానం తయారైంది. ఇది పది కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించగలుగుతోంది. తొలిసారి విమానం గాల్లో ఎగిరినప్పుడు కాసెర్వా గ్రామస్థుల ఆనందానికి అవధుల్లేవు. గ్రామ ప్రతిష్టను నింగికి చేర్చాడంటూ వాజిద్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు వారు. మరి, విమాన సంస్థల మాటేమిటో..!