builds
-
తల్లి కోసం గుడి కట్టిన స్టార్.. సందర్శించిన లారెన్స్ (ఫోటోలు)
-
రోజు కూలీ.. విమానం లాంటి ఇంటిని కట్టుకున్నాడు
విమానంలో ప్రయాణించాలనే ముచ్చట చాలామందికే ఉంటుంది. కానీ, అతడికి విమానంలో నివాసం ఉండాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. ఎగిరే విమానంలో నివాసం ఏర్పరచుకోవడం ఎలాగూ కుదిరే పని కాదు కనుక విమానంలాంటి ఇంటిని నిర్మించుకున్నాడు. తన కలల నివాసాన్ని నిర్మించుకోవడానికి కంబోడియాకు చెందిన ఆండ్ క్రాచ్ పోవ్ దాదాపు ముప్పయ్యేళ్లు కష్టపడ్డాడు. మొత్తానికి ఇన్నాళ్లకు నేలకు ఇరవై అడుగుల ఎత్తున ఎగురుతున్న విమానంలాంటి భవంతిని నిర్మించుకున్నాడు. దీని నిర్మాణం కోసం తన పదమూడో ఏట నుంచి డబ్బు కూడబెట్టడం ప్రారంభించాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఖర్చుల కోసం ఇచ్చిన చిల్లర డబ్బు మొదలుకొని పెద్దయ్యాక భవన నిర్మాణాలు సహా రకరకాల పనులు చేసి 7.84 కోట్ల రియెల్స్ (రూ.15.63 లక్షలు) పోగు చేశాడు. ఆ డబ్బుతోనే ఈ ఇంటిని నిర్మించుకుని, తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. భవన నిర్మాణంలో అనుభవం ఉన్న పోవ్ ఈ ఇంటిని నిర్మిస్తున్నప్పుడు చుట్టుపక్కల జనాలు ఇతడిని ఒక పిచ్చోడిలా చూశారు. నిర్మాణం పూర్తవుతున్న దశలో ఈ ఉదంతం పోవ్ నివాసం ఉండే సీమ్ రీప్ ప్రావిన్స్‌లో సంచలన వార్తగా మారింది. తన ఇంటికి దగ్గర్లోనే ఒక కాఫీ షాపును ఏర్పాటు చేయాలనుకుంటున్నానని, త్వరలోనే అసలు విమానంలో ఎగరాలనే తన కలను కూడా నిజం చేసుకుంటానని పోవ్ మీడియాకు చెబుతున్నాడు. -
నిత్యానంద దేశం.. కైలాస!
న్యూఢిల్లీ: అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద స్వామీజీ నిత్యానంద సొంతంగా ఓ దేశాన్నే ఏర్పాటు చేసుకున్నారు. ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి ‘కైలాస’ అనే పేరు కూడా పెట్టారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు దగ్గర్లో ఉన్న తన ద్వీప దేశానికి ఒక పాస్‌పోర్ట్‌ను, జెండాను, జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేశారు. ఒక ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. రోజూ కేబినెట్ భేటీలు కూడా జరుపుతున్నారని సమాచారం. ప్రధానిగా ‘మా’ని నియమించారని, గోల్డ్, రెడ్ కలర్లలో పాస్‌పోర్ట్‌ను రూపొందించారని ఆ ‘దేశ’ వెబ్సైట్ పేర్కొంది. తన ‘కైలాస’కు ఒక దేశంగా గుర్తింపునివ్వాలని కూడా నిత్యానంద ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేయనున్నారు. హిందూత్వని ప్రచారం చేస్తున్నందువల్ల భారత్‌లో తన జీవితం ప్రమాదంలో పడిందని ఐరాసకు పంపనున్న వినతి పత్రంలో నిత్యానంద పేర్కొన్నారు. కైలాస రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషి చేస్తుందని ఆ వెబ్సైట్లో పేర్కొన్నారు. దేశ పౌరసత్వం కావాలనుకునేవారు విరాళాలు ఇవ్వాలనే విజ్ఞప్తిని కూడా అందులో పొందుపర్చారు. మెరూన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ సింహాసనం ముందు నిత్యానంద కూర్చుని ఉండగా పక్కన నంది ఉన్న చిత్రంతో జెండాను రూపొందించారు. ప్రభుత్వంలో 10 శాఖలను కూడా ఏర్పాటుచేశారు. అందులో ఒకటి నిత్యానంద స్వామి కార్యాలయం కాగా, విదేశీ వ్యవహారాలు, రక్షణ, సోషల్ మీడియా, హోం, కామర్స్, విద్య.. మొదలైన ఇతర శాఖలు ఉన్నాయి. ప్రతిపాదిత కైలాస దేశ పాస్‌పోర్టు తమది సరిహద్దులు లేని దేశమని, తమ తమ దేశాల్లో స్వేచ్ఛగా హిందూయిజాన్ని అనుసరించలేని వారి కోసం ఈ దేశం ఏర్పాటయిందని కైలాస వెబ్ సైట్లో పేర్కొన్నారు. తమ దేశంలో ఉచితంగానే భోజనం, విద్య, వైద్యం లభిస్తాయని, ఆధ్యాత్మిక విద్య, ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై దృష్టి పెడతామని ఆ వెబ్సైట్లో పేర్కొన్నారు. ‘మాది భౌగోళికపరమైన దేశం కాదు. ఒక భావనాత్మక దేశం. శాంతి, స్వేచ్ఛ, సేవాతత్పరతల దేశం. ఏ దేశ ఆధిపత్యం కింద లేని మేం ఇతర దేశాలతో, అంతర్జాతీయ సంస్థలతో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాం’ అని అందులో తెలిపారు. నకిలీ పాస్‌పోర్ట్‌తో, నేపాల్ మీదుగా ఇటీవల నిత్యానంద పారిపోయారు. -
ఉద్యోగం రాలేదని.. విమానం తయారుచేశాడు!
ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించడం కంటే కష్టమైన పని వేరే ఏదీ లేదంటే ఒప్పుకొని తీరాల్సిందే. చేతిలో డిగ్రీ పట్టాలతో రోడ్లపై తిరుగుతోన్న నిరుద్యోగుల పాట్లు అలా ఉన్నాయి మరి. దేశంలోని సగటు నిరుద్యోగి పరిస్థితే ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల అబ్దుల్ వాజిద్కూ ఎదురైంది. కోరుకున్న రంగంలో ఉద్యోగం లేక, దొరికిన ఏదో ఒక పని చేయలేక.. నరకం చూశాడు. తనకు ఆసక్తి ఉన్న రంగంలోని సంస్థల ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. కానీ, ఎక్కడా తిరస్కారమే ఎదురైంది. దీంతో వాజిద్లో కసి పెరిగింది. తనను తిరస్కరించినవారికి తానంటే ఏమిటో చూపించాలనుకున్నాడు. అంతే.. ఓ విమానం తయారు చేసేసి, అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశాడు. ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా కాసెర్వా గ్రామానికి చెందిన వాజిద్, స్వగ్రామంలోనే ఇంటర్ వరకూ చదువుకున్నాడు. తర్వాత గ్య్రాడ్యుయేషన్ కోసం ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్లాడు. అక్కడ ఎన్సీసీలో చేరి, తరచూ క్యాంపులకు వెళ్లేవాడు. అలా ఓ క్యాంపులో ఎయిర్ ఫోర్స్‌ను సందర్శించాడు. అప్పుడే విమానాలపై మొట్టమొదటిసారిగా ఆసక్తి పెంచుకున్నాడు వాజిద్. ఎన్సీసీ ట్రైనింగ్‌లో ఎంతో శ్రమించి, ఎయిర్ ఫోర్స్ విభాగం నుంచి ‘సి’ సర్టిఫికెట్ కూడా సంపాదించాడు. తర్వాత, న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ విమానాశ్రయంలో ‘ఏరో మోడలింగ్’లో శిక్షణ పొందే అవకాశం కూడా దక్కించుకున్నాడు. ఇక్కడ నేర్చుకున్న విషయాలు అతడికి విమానయాన రంగంపై మరింత ఆసక్తిని కలిగించాయి. ఎలాగైనా విమాన తయారీ రంగంలో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. డిగ్రీ పూర్తి చేసుకున్నాక, ఉద్యోగం కోసం సంస్థల చుట్టూ తిరిగాడు. కానీ, ఎవరూ వాజిద్‌కు ఉద్యోగమిచ్చేందుకు ముందుకు రాలేదు. దీంతో తానే స్వయంగా విమానం తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ఇందుకు చాలా ఖర్చవుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులకు విషయం చెప్పి చూశాడు. మొదట్లో ఎవరూ వాజిద్ మాటలను సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, వాజిద్ పాత సామాన్లను కొనుగోలు చేసి, విమాన భాగాలుగా మార్చుతుంటే వారికీ నమ్మకం కుదిరింది. తలా కొంత మొత్తం పోగు చేసి, ఐదు లక్షల రూపాయల వరకూ అతడి చేతిలో పెట్టారు. వీటితో ఓ పాత మారుతీ వ్యాన్‌ను కొన్నాడు వాజిద్. దాని ఇంజిన్‌ను విమానంలో అమర్చాడు. 25 లీటర్ల ఇంధన సామర్థ్యమున్న ట్యాంకర్ని ఏర్పాటు చేశాడు. చెక్క, పాత ఇనుప సామానుతో తయారు చేసిన బాడీ పైభాగంలో స్టీలు పూత పూశాడు. మొత్తంగా 350 కిలోల బరువైన విమానం తయారైంది. ఇది పది కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించగలుగుతోంది. తొలిసారి విమానం గాల్లో ఎగిరినప్పుడు కాసెర్వా గ్రామస్థుల ఆనందానికి అవధుల్లేవు. గ్రామ ప్రతిష్టను నింగికి చేర్చాడంటూ వాజిద్‌ను ఆకాశానికెత్తేస్తున్నారు వారు. మరి, విమాన సంస్థల మాటేమిటో..!