
విమానంలో ప్రయాణించాలనే ముచ్చట చాలామందికే ఉంటుంది. కానీ, అతడికి విమానంలో నివాసం ఉండాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. ఎగిరే విమానంలో నివాసం ఏర్పరచుకోవడం ఎలాగూ కుదిరే పని కాదు కనుక విమానంలాంటి ఇంటిని నిర్మించుకున్నాడు. తన కలల నివాసాన్ని నిర్మించుకోవడానికి కంబోడియాకు చెందిన ఆండ్ క్రాచ్ పోవ్ దాదాపు ముప్పయ్యేళ్లు కష్టపడ్డాడు.
మొత్తానికి ఇన్నాళ్లకు నేలకు ఇరవై అడుగుల ఎత్తున ఎగురుతున్న విమానంలాంటి భవంతిని నిర్మించుకున్నాడు. దీని నిర్మాణం కోసం తన పదమూడో ఏట నుంచి డబ్బు కూడబెట్టడం ప్రారంభించాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఖర్చుల కోసం ఇచ్చిన చిల్లర డబ్బు మొదలుకొని పెద్దయ్యాక భవన నిర్మాణాలు సహా రకరకాల పనులు చేసి 7.84 కోట్ల రియెల్స్ (రూ.15.63 లక్షలు) పోగు చేశాడు. ఆ డబ్బుతోనే ఈ ఇంటిని నిర్మించుకుని, తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు.
భవన నిర్మాణంలో అనుభవం ఉన్న పోవ్ ఈ ఇంటిని నిర్మిస్తున్నప్పుడు చుట్టుపక్కల జనాలు ఇతడిని ఒక పిచ్చోడిలా చూశారు. నిర్మాణం పూర్తవుతున్న దశలో ఈ ఉదంతం పోవ్ నివాసం ఉండే సీమ్ రీప్ ప్రావిన్స్‌లో సంచలన వార్తగా మారింది. తన ఇంటికి దగ్గర్లోనే ఒక కాఫీ షాపును ఏర్పాటు చేయాలనుకుంటున్నానని, త్వరలోనే అసలు విమానంలో ఎగరాలనే తన కలను కూడా నిజం చేసుకుంటానని పోవ్ మీడియాకు చెబుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment