కుంకుమ పూల సాగు గదిలో శైలజారెడ్డి
కశ్మీర్‌లోని చల్లని ప్రదేశాల్లోనే సహజంగా ఆరుబయట పొలాల్లో కుంకుమ పువ్వు పండుతుంది. అయితే, కృత్రిమ శీతల వాతావరణం సృష్టించిన గదుల్లో కూడా ఈ పంటను పండిస్తున్నారు. నీలిరంగులో ఉండే పూలకు మధ్యలో ఈ ఎరట్రి దారాల్లాంటి కేసరాలు ఉంటాయి. వాటిని సేకరించి జాగ్రత్తగా నీడన ఎండబెట్టి భద్రపరిచి వాడుకోవచ్చు లేదా విక్రయించవచ్చు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉద్యోగం చేస్తున్న కె. శైలజారెడ్డి తన ఇంట్లోనే ఒక గదిలో కుంకుమ పువ్వును ఇంటిపంటగా పండిస్తున్నారు.
అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం కుంకుమ పువ్వు. రోగనిరోధక శక్తిని, ఆరోగ్యాన్ని అందించే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. గర్భవతులు కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగుతుంటారు. స్వీట్లు, ఖీర్, బిర్యానీ, ఫ్రూట్ సలాడ్లలో దీన్ని వాడుతుంటారు. శ్రీఅన్నమయ్య జిల్లా మదనపల్లిలో శ్రీనిధి అనే యువతి కుంకుమ పువ్వు సాగు చేస్తున్న వీడియోలు యూట్యూబ్‌లో చూసి స్పూర్తి పొందిన శైలజారెడ్డి తన ఇంట్లోనే కుంకుమ పువ్వు సాగు చేపట్టారు. ఇండియా మార్ట్ ద్వారా కుంకుమ పువ్వు విత్తనాలను కశ్మీర్ నుంచి తెప్పించారు. ప్రస్తుతం అక్కడ రైతులకు, విత్తనాలను సేకరించి అమ్మే వారికి మధ్య వివాదం రావడంతో ప్రభుత్వ అనుమతితోనే విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోందని శైలజారెడ్డి తెలిపారు.
రూ. 4 లక్షల పెట్టుబడి
శైలజారెడ్డి తన మూడు బెడ్‌రూమ్‌లతో కూడిన ఇంట్లోనే.. 12“12 అడుగుల విస్తీర్ణం ఉన్న ఒక గదిలో ఇనుప ర్యాక్‌లలో ఫైబర్ టబ్‌లు, కృత్రిమ వెల్తురు సదుపాయాలను సమకూర్చి కుంకుమ పువ్వు పండిస్తున్నారు. విత్తనాలకు, ఈ ఏర్పాట్లకు రూ. 4 లక్షల వరకూ పెట్టుబడి పెట్టారు. చల్లని వాతావరణం కుంకుమ పువ్వు సాగుకు అనువైనది. మనం గదిలో కృత్రిమ శీతల వాతావరణాన్ని కల్పించి నిశ్చింతగా సాగు చేయవచ్చని శైలజారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గదిలో రాత్రిపూట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్షియస్ ఉండాలి. గాలిలో తేమ శాతం 80% ఉండాలి.
ఇందుకోసం గదిలో చిల్లింగ్ యంత్రాన్ని, హ్యుమిడిఫయర్‌ను ఏర్పాటు చేశారు. కృత్రిమ కాంతితో కూడిన తగుమాత్రపు వేడి కోసం గదిలో 20 వరకూ గ్రోలైట్లు ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ఈ లైట్లు వెలిగిస్తే సరిపోతుంది. పూత దశలో తప్ప ఇతర కాలాల్లో గది పగటి ఉష్ణోగ్రత 16–17 డిగ్రీల వరకు ఉండొచ్చు. ఎయిరోపోనిక్స్ పద్ధతిలో కుంకుమ పువ్వును సాగు చేస్తున్న శైలజారెడ్డి ఇటీవలే తొలి పంట తీశారు.
ఇప్పటి వరకూ 1441 పువ్వులు పూస్తే అందులో నుంచి 10 గ్రాముల కుంకుమ పువ్వు కేసరాల దిగుబడి వచ్చింది. గ్రాము రూ. ఏడు వందల చొప్పున ఆరు గ్రాములను అమ్మారు. మిగిలిన కుంకుమ పువ్వును తనతోపాటు పనిచేసే వారికి కొంచెం కొంచెం బహూకరించాలని నిర్ణయించుకున్నట్లు శైలజారెడ్డి చెప్పారు. తాను గతంలో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి కొనుగోలు చేసిన కుంకుమపువ్వును ఇప్పుడు తాను పండించిన కుంకుమ పువ్వుతో పోల్చి పరిశీలించినప్పుడు, అది కల్తీది అని స్పష్టంగా అర్థమైందన్నారు.
గ్రోలైట్ల వెలుగులో కుంకుమ పూల సాగు వాడకానికి సిద్ధమైన కుంకుమ పువ్వు
ఎయిరోపోనిక్స్..?
కుంకుమ పువ్వు విత్తన దుంపలను ట్రేలలో పోసిన మట్టి మిశ్రమం (మట్టి 50%, ఇసుక 40%, వర్మీ కంపోస్టు పది మట్టి%)లో నాటుకొని పెంచుకోవచ్చు. మట్టి లేకుండా ఎయిరోపోనిక్స్ పద్ధతిలో కూడా సాగు చేయొచ్చు. అంటే.. విత్తన దుంపలను ట్రేలో పక్క పక్కనే పెడితే సరిపోతుంది. మట్టిలో గాని, నీటిలో గాని వాటిని పెట్టాల్సిన పని లేదు. గాలిలో తేమ 80%తో పాటు చల్లని వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ తేమతోనే మొక్క పెరిగి, 30–45 రోజుల్లో పూత వస్తుంది. వేరే పోషణ ఏమీ అవసరం లేదు. 7 గ్రాముల కన్నా ఎక్కువ బరువు ఉన్న విత్తన దుంపలు వాడితేనే ఆ సీజన్‌లో పూలు వస్తాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఏరోపోనిక్స్ పద్ధతిలో పెంచే దుంపలను కూడా పూత కాలం పూర్తయిన తర్వాత మట్టి మిశ్రమంలో విధిగా నాటుకోవాల్సిందే.
నవంబర్– డిసెంబర్‌లో మట్టి మిశ్రమంలో నాటుకోవాలని శైలజారెడ్డి వివరించారు. వారం/పది రోజులకోసారి నీటిని కొంచెం పిచికారీ చేస్తే సరిపోతుంది. నానో యూరియా లేదా ఎన్‌పికెను నెలకోసారి పిచికారీ చేస్తే చాలు. ప్రతి దుంపకు అనుబంధంగా మూడు, నాలుగు దుంపలు పుట్టుకొస్తాయి. ఏప్రిల్ నెల నుంచి జూన్ వరకు దుంపలు నిద్రావస్థలో ఉంటాయి. ఆ దశలో వాటికి ఆహారం, కాంతి, చల్లని వాతావరణం, గాలిలో 80% తేమ అవసరం లేదు. కుంకుమ పువ్వు దుంపలను జూలైలో మట్టిలో నుంచి తీసి 7 గ్రాములు అంతకన్నా ఎక్కువ బరువు ఉన్న పిల్ల దుంపలను వేరు చేసి, తిరిగి మట్టి మిశ్రమంలో నాటుకొని కుంకుమ పువ్వు సాగు చేయవచ్చు. లేదా విత్తన దుంపలను ట్రేలలో పెట్టుకొని ఏరోపోనిక్స్ పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. అప్పటి నుంచి మళ్లీ నిద్రావస్థ వరకు నిరంతరాయంగా 8 నెలలు శీతల వాతావరణం ఉండేలా చూసుకుంటూ సాగు చేయాల్సి ఉంటుందని శైలజారెడ్డి వివరించారు.
మొదటి ఏడాదే పెట్టుబడి!
ఇంట్లోనే ఒక గదిలో కుంకుమ పువ్వు సాగు చేయడానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి మొదటి సంవత్సరమే పెట్టుబడి అవసరమవుతుంది. రెండో సంవత్సరం నుంచి విత్తన ఖర్చు ఉండదు. నాలుగైదు సంవత్సరాల్లో పెట్టుబడి తిరిగి రావడంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. పెద్ద మొత్తంలో సాగు చేస్తే ఉపయోగం ఉంటుంది. కుంకుమ పువ్వు సాగును ఇంటిపంటగా ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు రావడం ఖాయం. నాణ్యమైన కుంకుమ పువ్వును మనమే పండించుకోవచ్చు. ఈ అనుభవాలను ఇతరులకు పంచాలని ‘శాన్వి శాఫ్రన్ ఫార్మ్స్’ పేరిట యూట్యూబ్ ఛానల్‌ను ఏర్పాటు చేశాను.
– కె. శైలజారెడ్డి, కుంకుమ పువ్వు సాగుదారు, తాడేపల్లి, గుంటూరు జిల్లా .
మొబైల్: 94912 33492.
(సా. 7 గం. తర్వాత ఫోన్ చేయొచ్చు)
www.youtube.com/ @ShanviSaffronFarms
– దాళా రమేష్ బాబు, సాక్షి, బ్యూరో ఇన్‌చార్జ్, గుంటూరు
(చదవండి: టమోటాలు ఇలా కూడా పెంచవచ్చు!)
Comments
Please login to add a commentAdd a comment