
జయ మృతిపై నేడు విచారణ
టీనగర్ (చెన్నై): జయలలిత మృతిపై గురువారం మద్రాసు హైకోర్టులో విచారణ జరగనుంది. అనుమానాస్పద రీతిలో తమిళనాడు సీఎం జయలలిత మృతి చెందినందున సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేయాలని చెన్నై అరుంబాక్కంకు చెందిన జోసెఫ్ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను అన్నాడీఎంకేలో సభ్యునిగా ఉన్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 22న జయ అపోలో ఆస్పత్రిలో చేరాక ఏమి జరిగిందనే వాస్తవ విషయం ప్రజలకు తెలియలేదన్నారు.
తొలుత జ్వరం కారణంగా జయను ఆస్పత్రిలో చేర్చారని, రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తారని వార్తలు వెలువడ్డాయని తెలిపారు. అయితే అది జరగలేదని, ఆమె ఆరోగ్యం క్షీణించిందని చెబుతూ అపోలో ఆస్పత్రి వారు బులిటెన్లు విడుదల చేశారన్నారు. జయ దేహాన్ని చూసిన వారు ఆమె రెండు కాళ్లు తొలగించినట్లు గమనించారని, ఆమె దేహం ఎక్కువ రోజులు చెడకుండా ఉండేందుకు ఆస్పత్రి వర్గాలు ఈ రీతిలో చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోందన్నారు.