
నేడు కౌంట్‌డౌన్ షురూ
- సాయంత్రం 3.58 గంటలకు ప్రారంభం
- రేపు సాయంత్రం 5.28 గంటలకు జీఎస్‌ఎల్‌వీ మార్క్3డీ1 ప్రయోగం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సతీశ్ ధవన్ స్పేస్ సెం టర్(షార్) నుంచి జీఎస్ ఎల్‌వీ మార్క్3–డీ1 ఉప గ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి సోమ వారం సాయంత్రం 5.28 గంటలకు దీన్ని ప్రయోగిం చనున్న విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం 3.58 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించాలని శనివారం జరిగిన ఎంఆర్ ఆర్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.
ఇస్రో చరిత్రలోనే అతిపెద్ద ప్రయోగం కావడంతో శాస్త్రవేత్తలు ప్రతి అంశాన్నీ జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. 3 టన్నుల బరువైన ఉపగ్రహాన్ని షార్ నుంచి ప్రయోగించడం ఇదే తొలి సారి. మార్క్–3 లాంటి అతి భారీ రాకెట్‌ను దశాబ్దంపాటు పలు పరీక్షల అనంతరం 2014 డిసెంబర్, 18న ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. దాంట్లో క్రయోజెనిక్ దశ లేకుండా డమ్మీని పెట్టగా, ఈసారి 25 టన్నుల క్రయోజెనిక్ ఇంధనంతో పూర్తిస్థాయి ప్రయోగానికి సిద్ధమైంది. అన్ని ఇస్రో సెంటర్ల డైరెక్టర్లు ప్రయోగంలో పాలు పంచుకుంటున్నారు. ఆదివారం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ షార్‌కు వచ్చి కౌంట్‌డౌన్‌ను పరిశీలించి శాస్త్రవేత్తలతో సమీక్ష జరపనున్నారు.