
నేడు రఘువర్ దాస్ ప్రమాణం
- హాజరుకానున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ/రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్ ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజధాని రాంచీలోని బిర్సా ముండా ఫుట్‌బాల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం జరగనుందని రాష్ట్ర హోం కార్యదర్శి ఎన్.ఎన్. పాండే తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్ చౌహాన్, రమణ్‌సింగ్, ఇతర నేతలు హాజరవుతారని చెప్పారు.
మరోవైపు దాస్ శనివారం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో ఢిల్లీలో సమావేశమై ప్రభుత్వ కూర్పుపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ షాతో సమావేశం సానుకూలంగా సాగిందని, పార్టీ ఆదేశాల ప్రకారం తాను నడుచుకుంటానని చెప్పారు. గిరిజన జనాభా ఎక్కువగా ఉండే జార్ఖండ్‌లో గిరిజనేతరుడైన దాస్‌కు బీజేపీ అధిష్టానం సీఎం పగ్గాలు అప్పగించిన నేపథ్యంలో మంత్రివర్గంలో గిరిజనులకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంపై ఈ భేటీ సాగినట్లు తెలుస్తోంది.