టమోటా కిలో అర్ధ రూపాయే!
టమోటా కిలో అర్ధ రూపాయే!
Published Sat, Dec 10 2016 9:48 AM | Last Updated on Tue, May 29 2018 11:17 AM
నెలల తరబడి కష్టపడి పండించిన పంట.. టన్నుల కొద్దీ టమోటాలు.. వాటన్నింటినీ నేలమీద పారబోసి, తీసుకొచ్చిన లారీలతోనే తొక్కించేశారా రైతులు!! కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకునే పంటను ఇంతలా చేయడానికి కారణం.. వాళ్ల కన్నీళ్లే. ఎందుకంటే, వంద కిలోల టమోటాలకు అక్కడి వ్యాపారులు చెబుతున్న ధర కేవలం 50 రూపాయలే. అంటే, కిలోకు కేవలం అర్ధరూపాయి ధర పలుకుతోందన్న మాట. ఇదంతా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో పరిస్థితి. కిలో అర్ధరూపాయికి అమ్ముకోవడం కంటే, ఇలా తొక్కించి నాశనం చేయడమే మంచిదని భావించిన రైతులు ఇలా చేశారని అంటున్నారు.
ఆ జిల్లాలోని పాతల్‌గావ్, ఫర్సాబహార్ గ్రామాలకు చెందిన రైతులు తాము పండించిన పంటను మార్కెట్‌కు తీసుకొచ్చినప్పుడు ఈ దుస్థితి ఎదురైంది. కనీసం కోత కూలీ, రవాణా ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో తమ ఆక్రోశాన్ని ఈ రకంగా వెళ్లగక్కారు. దాదాపు 4200 హెక్టార్ల విస్తీర్ణంలో టమోటా పండిస్తున్నారని, సుమారు 4 వేల మంది రైతులు దీనిపై ఆధారపడ్డారని స్థానికులు చెబుతున్నారు. టమోటాల లాంటి సరుకులను నిల్వ చేసుకోడానికి వీలుగా రాష్ట్రంలో కోల్డ్ స్టోరేజిలను ఏర్పాటు చేయిస్తామని 2010లో ముఖ్యమంత్రి రమణ్ సింగ్ చెప్పారు. ఆరేళ్లు గడిచినా ఇంకా అవి ఏర్పాటుకాలేదు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టించాలని రైతులు కోరినా, అదీ నెరవేరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల జీవనం ఘోరంగా మారిందని వాపోతున్నారు.
Advertisement