బిచ్చమెత్తుకుంటూ వ్యాపారుల నిరసన
ముజఫర్‌నగర్: నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటివరకు నగదు చెల్లింపులపైనే ఆధారపడిన వ్యాపారాలు ఒక్కసారిగా కుంటుపడటంతో వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక‍్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లోని వ్యాపారులు నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ గురువారం బిచ్చమెత్తుకుంటూ నిరసన తెలిపారు.
స్థానిక ఉద్యోగ వ్యాపార్ సంఘటన్ ఆధ్వర్యంలో భారీగా వర్తకులు గిన్నెలు పట్టుకొని శివ చౌక్‌లో రోడ్డుపై అడుక్కుంటూ నిరసన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు మూలంగా వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయాయని అందుకే ఇలా నిరసన తెలుపుతున్నామని సంఘం ఉపాధ్యక్షుడు గోపాల్ మిట్టల్ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేస్తూ వారు తమ నిరసనను తెలిపారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీ క్యూలతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. పలు చోట్ల బ్యాంకుల వద్ద ఉద్రిక‍్త పరిస్థితులు నెలక్నొన్నాయి.