
బస్టాండ్‌లో బోణీలు లేవు..
• వ్యాపారాలు ఢమాల్
• నెల వారీ అద్దె కట్టలేని స్థితిలో దుకాణ దారులు
• పండుగ సీజన్‌లోనూ పుంజుకోని కొనుగోళ్లు
సాక్షి, అమరావతి బ్యూరో : పండుగ సీజన్‌లో కళకళలాడాల్సిన వ్యాపారులు వెలవెలబోతున్నాయి. పెద్దనోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉంది. నోట్ల కష్టాలతో ప్రయాణాలు తగ్గిపోయారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో వ్యాపారాలు పడిపోయాయి. దుకాణాదారులు నెలవారీ అద్దెలు చెల్లించలేని దుస్థితిలో ఉన్నారు.
పండుగ సీజన్‌లోనూ..
సంక్రాంతి సీజన్ ప్రారంభమైనా బస్టాండ్ సందడి కనిపించడం లేదు. ఆర్టీసీ బస్‌స్టాండ్‌లో నిత్యం 2900 పైగా బస్సులు ద్వారా సుమారు 1.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుం టారు. పెద్ద నోట్ల రద్దుతో ఆ సంఖ్య సుమారు 30 వేలకు తగ్గిందని ఆర్టీసీ అధికారులే చెబుతున్నారు. సహజంగా పండుగ సీజన్‌లో ప్రయాణికులు సంఖ్య పెరుగుతోంది. దానికి అనుగుణంగా వ్యాపారాలకు అవకాశం ఉంది. కానీ ఈ ఏడాది పండుగ కళ కనిపించడం లేదు.
126 దుకాణాల్లో..
ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో మొత్తం 126 దుకాణాలు ఉన్నాయి. నెలవారీ రూ.10 వేలు చెల్లించే షాపు నుంచి రూ.10 లక్షలు చెల్లించే షాపులున్నాయి. ఆయా షాపుల నుంచి నెలకు సుమారు రూ.7 కోట్ల రుపాయల వరకు అద్దెలు రూపంలో ఆర్టీసీ ఖజానాకు జమ అవుతోంది. 126 షాపులకు గాను అద్దెలు చెల్లించలేక 11 స్టాల్స్‌ను మూసివేశారు. మరో 11 షాపుల వారు రెండు నెలలుగా అద్దె చెల్లించలేక బకాయి పడ్డారు. నాలుగు షాపుల వారు మూడు నెలల పాటు అద్దె బకాయిలున్నారు. మూడు నెలలు అద్దె చెల్లించకుంటే షాపుల అగ్రిమెంట్ రద్దయ్యే అవకాశం ఉంది. దీంతో ఆదుకునే వారు లేరని చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
వినోదానికి చిల్లే..
ఆర్టీసీలో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టి నిర్వహిస్తున్న వై స్కీన్ సినిమా హాళ్లల్లో ప్రేక్షకులు లేక డిస్ట్రీబ్యూటర్లు నష్టాల బారిన పడుతున్నారు.
బేరాలు లేక ఇబ్బంది
నోట్ల రద్దు తర్వాత బస్టాండ్‌లో పరిస్థితి మారిపోయింది. ఆదాయం వస్తేనే ఆర్టీసీకి అద్దె కట్టగలను. ప్రయాణికులు అవసరమైతే తప్ప ఖర్చు చేయడం లేదు. దీంతో మా వ్యాపారాలు పడిపోయాయి. బేరాలు లేక ఇబ్బందిపడుతున్నా. బేరాలు ఉన్నా లేకపోయినా సిబ్బందికి జీతాలు, ఆర్టీసీకి అద్దె, విద్యుత్ బిల్లు చెల్లించాల్సి ఉంది.
–ప్రసాద్, స్టాల్ నిర్వాహకుడు, విజయవాడ బస్‌స్టేషన్
అప్పుల ఊబిలో పడిపోతున్నాం..
బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ తగ్గింది. మా వ్యాపారాలు పడిపోతున్నాయి. మాకు ఖర్చులు మాత్రం తగ్గలేదు. దీంతో అప్పులు చేయాల్సి వస్తోంది. ఇప్పటికే అప్పులు చేసి వ్యాపారాలు పెట్టాం. మరింత అప్పుల ఊబిలో పడిపోతున్నాం. బస్టాండ్‌లోని వ్యాపారాల పరిస్థితి అధ్వానంగా ఉంది.
–అశోక్ స్టాల్ నిర్వాహకులు, బస్‌స్టేషన్, విజయవాడ