‘నా చెక్కును అమిత్‌షా మారుస్తాడని వచ్చాను’
అహ్మదాబాద్: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నానా హంగామా చేశారు. నరన్ పూరా ప్రాంతంలోని షా పాత నివాసం ముందు పెద్ద మొత్తంలో చేరి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ప్రస్తుతం ఆ నివాసాన్ని షా తన కార్యాలయంగా ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరిన కార్యకర్తలు, పార్టీ మద్దతు దారులు ఆయన ఇంట్లోకి దూసుకెళ్లే ప్రయత్నమే చేయకుండా అక్కడే అమిత్‌షా దిష్టిబొమ్మ తగులబెట్టే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.
‘రైతులు కోపరేటివ్ బ్యాంకుల నుంచి డబ్బులు పొందలేకపోతున్నారు. ఆ విషయం అడగడానికే మేం అమిత్‌షా వద్దకు వచ్చాం. నేను చెక్ తో వచ్చాను. నాకు దీన్ని మార్చి డబ్బు ఇప్పించాలని అడుగుతాను. గంటల తరబడి బ్యాంకు ముందు నిల్చున్నాను. కానీ చివరకు డబ్బు లేదని చెప్పారు. ఏం చేస్తే నా చేతికి డబ్బు వస్తుందో అడిగేందుకు అమిషా వద్దకు వచ్చాను’ అని గుజరాత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జితు పటేల్ అన్నారు. దాదాపు రెండుగంటలపాటు ఈ వ్యవహారం కొనసాగింది. అనంతరం పోలీసులు 70 మందిని అదుపులోకి తీసుకున్నారు.