
విహారయాత్రలో విషాదం
- బీచ్‌లో 11 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు
- 8 మృతదేహాలు లభ్యం
సాక్షి, ముంబై/బనశంకరి(బెంగళూరు): విద్యార్థుల విహారయాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్టడీటూర్ ముగించుకుని సరదాగా బీచ్ స్నానానికి వెళ్లిన వారిలో 8 మంది విగతజీవులుగా ఒడ్డుకు కొట్టుకొచ్చారు. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలోని వాయరి బీచ్‌లో శనివారం ఈ ఘోరం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రం బెళగావిలోని మరాఠా ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన 47 మంది విద్యార్థులు స్టడీటూర్ నుంచి తిరిగి వస్తూ శనివారం విహారయాత్రకు వెళ్లారు.
మధ్యాహ్నం సమయంలో బీచ్‌లో ఈత కొడుతుండగా.. ప్రమాదవశాత్తూ 8 మంది అరేబియా సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలోని లోతైన ప్రాంతానికి వెళ్లడంతో ఒక్కసారిగా రాకాసి అలలు వారిని మింగేశాయి. మృతుల్లో ఐదుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారని పోలీసులు తెలిపారు. మునిగిపోతున్న విద్యార్థుల్ని రక్షించేందుకు మిగతా విద్యార్థులు ప్రయత్నించినా అప్పటికే ఆలస్యమైందని సింధుదుర్గ్ ఎస్పీ అమోఘ్ గోయంకర్ చెప్పారు.
మొత్తం ఎనిమిది మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా పోలీసుల సాయంతో ముగ్గురు విద్యార్థుల్ని ఒడ్డుకు తీసుకురాగా చికిత్స కోసం వారిని సమీపంలోని మాల్వన్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నవారిలో ఒకమ్మాయి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. స్టడీటూర్‌లో భాగంగా గత గురువారం మహారాష్ట్రలోని పుణేలో ఇండస్ట్రియల్ మీట్‌కు ఈ విద్యార్థులు హాజరయ్యారు. మృతదేహాల్ని సింధుదుర్గ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనతో కర్ణాటకలోని బెళగావి నగరంలో విషాదం అలముకుంది.
స్టడీ టూర్‌కు అనుమతి లేదు: ప్రిన్సిపాల్
ఘటనపై మరాఠా మండల కాలేజీ ప్రిన్సిపాల్ విశ్వనాథ్ ఉడుపి స్పందిస్తూ... విద్యార్థుల స్టడీ టూర్‌కు అనుమతి నిరాకరించినా వెళ్లారని చెప్పారు. ఇండస్ట్రియల్ మీట్ పూర్తి కాగానే నేరుగా కాలేజీకి రావాలని విద్యార్థులకు సూచించామన్నారు.