మేడ్చల్, న్యూస్‌లైన్ : హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నది వద్ద జరిగిన ప్రమాదం నుంచి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం శ్రీరంగవరం గ్రామానికి చెందిన సద్ది దివ్య త్రుటిలో బయటపడింది. తాను క్షేమంగా ఉన్నానని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన దివ్య సంఘటన జరిగిన తీరును ఫోన్‌లో ‘న్యూస్‌లైన్’కు వివరించింది. ‘ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూ ప్రాంతానికి చేరుకున్నాం. 52 మందిలో 38 మంది బస్సు దిగాం. ఆడుకుంటూ రాళ్లపై కూర్చుని ఫొటోలు దిగుతున్నాం. అందరం గ్రూపు ఫొటో దిగాలని నది మధ్యలోకి వెళ్లి నిల్చున్నాం. మాలో ఒకరైన అఖిల్ అనే విద్యార్థి ఫొటోలు తీస్తున్నాడు. గ్రూపు ఫొటోను నా కెమెరాలోనూ తీయాలని చెప్పేందుకు నా వద్ద ఉన్న కెమెరా ఇచ్చేందుకు అఖిల్ వద్ద వెళ్లా. అంతలోనే నీటి ప్రవాహం ఒక్కసారిగా ఎక్కువైంది. నా వద్దకు కూడా వరద ఉధృతి వస్తున్న సమయంలోనే ఓ విద్యార్థి పక్కకు లాగారు.
దీంతో ప్రవాహం బారినుంచి త్రుటిలో తప్పుకున్నా. కెమెరానే నన్ను కాపాడింది’ అంటూ రోదిస్తూ చెప్పింది. ‘బియాస్ నదిపై ఉన్న డ్యాం నుంచి నీళ్లు వదిలిన విషయం తమకెవరికీ తెలియదు. తాము ఉన్న ప్రాంతం నుంచి కొద్ది దూరంలో ఉన్న కొంతమంది ఈలలు వేస్తూ చేతులు ఊపుతూ సంజ్ఞలు చేశారు.. మాకు అర్థం కాలేదు. హాయ్ చెబుతున్నారనుకుని తిరిగి మేమూ హాయ్ చెప్పాం. నీటి ప్రవాహం వస్తోందని, దూరంగా వెళ్లండని చెబుతున్నారన్న విషయం ఘటన తర్వాత అర్థమైంది’ అని దివ్య వెల్లడించింది.