ఒక్క ఎలుక.. రైలును ఆపేసింది!!
తమిళనాడులోని మదురై జంక్షన్లో ఓ రైలు దాదాపు అరగంట పాటు ఆగిపోయింది. ఇంతకీ ఆ రైలును అంతసేపు ఆపేసిన వీవీఐపీ ఎవరో తెలుసా.. ఓ ఎలుక!! ఎలాగంటారా, రైల్లో ప్రయాణిస్తున్న ఓ పెద్దాయనను ఆ ఎలుక కాస్తా కొరికిపెట్టింది. ఛార్లెస్ (54) అనే పెద్దమనిషి చెన్నై నుంచి తిరునల్వేలి వెళ్లే నెల్లై ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నారు. తెల్లవారుజామున ఆ రైలు మదురై స్టేషన్ చేరుకుంటోందనగా.. తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఓ ఎలుక ఆయన చెవిని కొరికి పారేసింది. 5 గంటల సమయంలో మదురైకి రైలు చేరుకోగానే ముందుగానే అక్కడకు వచ్చిన వైద్యులు వెంటనే ఆయనకు చికిత్స చేశారు. ఆ చికిత్స కోసం రైలును దాదాపు అరగంట పాటు ఆపేశారు.
తిరునల్వేలి, కన్యాకుమారి మీదుగా వెళ్లే చాలావరకు రైళ్లలో ఎలుకల బాధ భరించలేకుండా ఉన్నామని చాలాసార్లు ఫిర్యాదుచేసినా, సమస్య తీరలేదని రైల్వే యూజర్స్ అసోసియేషన్ నాయకుడు కేశవన్ తెలిపారు. ప్రధానంగా ప్రయాణికులు కూడా ఏవో ఒక తినుంబండారాలు తిని.. రైల్లో సగం సగం వదిలేయడం వల్లే ఇలా జరుగుతోందని ఆయన అన్నారు.