రైలు ప్రయాణ చార్జీలు మరోసారి పెరగనున్నాయి.
న్యూఢిల్లీ: రైలు ప్రయాణ చార్జీలు మరోసారి పెరగనున్నాయి. పెరుగుతున్న విద్యుత్ చార్జీల భారాన్ని ప్రయాణికులపై వేస్తూ, చార్జీల హెచ్చింపుతో రూపొందించిన ప్రతిపాదనలను వచ్చే సంవత్సరం ఆరంభంలో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌లో పొందుపరచనున్నారు. అలాగే, ఇంధన ధరల హెచ్చింపునకు అనుగుణంగా డిసెంబర్‌లో అమలు కావలసిన చార్జీల సవరణను కూడా ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌లో ప్రకటించే అవకాశాలున్నాయి.
ఇటీవల గత కొన్ని నెలల్లో విద్యుత్ చార్జీలు 4 శాతంపైగా పెరిగినందున రైలు ప్రయాణ చార్జీలను కూడా పెంచవలసిన అవసరం ఏర్పడిందని రైల్వే మంత్రిత్వశాఖ అధికారి ఒకరు చెప్పారు. రైల్వేలపై ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన విధానం ప్రకారం ఇంధనం, విద్యుత్ చార్జీలకు అనుగుణంగా రైలు ప్రయాణ చార్జీలు, సరుకు రవాణా చార్జీల సవరణ ఏడాదికి రెండుసార్లు అమలవుతూ వస్తోంది.