రైల్వే సిబ్బంది మెరుపుసమ్మె: నిలిచిన రైళ్లు
కర్ణాటక రాజధాని బెంగళూరులో రైల్వే సిబ్బంది మెరుపు సమ్మెకు దిగారు. దాంతో దాదాపు 8 వేల మంది ప్రయాణికులు ఎక్కడివారక్కడే చిక్కుకుపోయారు. బెంగళూరు రైల్వే డివిజన్లోని మొత్తం 188 స్టేషన్లపై సమ్మె ప్రభావం పడింది. మొత్తం ఆపరేషన్, కంట్రోల్ వ్యవస్థలన్నింటినీ స్విచాఫ్ చేసేశారు. ఇటీవల కొన్ని దశాబ్దాలలో రైల్వే సిబ్బంది ఇంత పెద్ద ఎత్తున సమ్మె చేయడం ఇదే మొదటిసారి. మొత్తం 36 రైళ్ల రాకపోకలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
తాను ఐదేళ్ల కొడుకుతోను, 11 నెలల పాపతోను ప్రయాణిస్తున్నానని, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని తన అత్తవారింట్లో భార్యను, పిల్లలను వదిలిపెట్టాల్సి ఉందని.. కానీ ఇప్పుడు ఇక్కడ రైలు ఆగిపోవడంతో తాను అందుకోవాల్సిన మరో రైలు తప్పిపోతుందని ప్రవీణ్ భవ్సర్ అనే ప్రయాణికుడు వాపోయారు. ఎట్టకేలకు రైల్వే మంత్రిత్వశాఖ కలగజేసుకున్న తర్వాతే రైళ్లు బయల్దేరాయి.
పార్కింగ్ ప్రదేశంలో చాలాకాలంగా వదిలేసిన వాహనాలను వేలం వేశారన్న ఆరోపణలతో ప్రభుత్వ రైల్వేపోలీసులు పాండురంగ అనే చీఫ్ కమర్షియల్ సూపర్వైజర్ను అరెస్టుచేశారు. ఈ అరెస్టుకు నిరసనగా దాదాపు 200 మంది గ్రూప్ సి, డీ ఉద్యోగులు అప్పటికప్పుడు నిర్ణయించుకుని సమ్మె ప్రారంభించారు. మొత్తం టికెట్ కౌంటర్లను కూడా మూసేశారు.