రాజకీయాలదే రాజద్రోహం!
జాతీయతపై చర్చ జరగాలన్న జేఎన్‌యూ
‘రోహిత్ కా జేఎన్‌యూ’ అంటూ వెలిసిన పోస్టర్లు
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టయి.. తీహార్ జైల్లో ఉన్న జేఎన్‌యూ విద్యార్థి సంఘ నేత కన్హయ్య కుమార్ కోసం ఎదురుచూస్తున్నామని ‘రోహిత్ కా జేఎన్‌యూ’, ‘జస్టిస్ ఫర్ రోహిత్’ పేరుతో వర్సిటీలో పోస్టర్లు వెలిశాయి. తీహార్ జైలునుంచి కన్హయ్య విడుదలై వర్సిటీకి తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు విద్యార్థులు, ప్రొఫెసర్లు కోరుతున్నట్లు వాటిలో ఉంది. ‘దేశంలో, వర్సిటీల్లో రాజద్రోహం గురించి కాదు.. రాజకీయాలే రాజద్రోహంగా తయారయ్యాయనే అంశంపై చర్చించాలి. భావప్రకటనను వ్యక్తీకరించినందుకు విద్యార్థులపై కేసులు పెట్టారు. ఇప్పుడు జాతీయతపై చర్చ జరగాలి’ అని జేఎన్‌యూఎస్‌యూ వైస్ ప్రెసిడెంట్ షెహ్లా రషీద్ షోరా తెలిపారు.
రాజద్రోహం కేసులో జైలుపాలైన తోటి విద్యార్థులకు మద్దతుగా సందేశాలిచ్చేందుకు.. నిరసన తెలియజేస్తున్న విద్యార్థులు జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వద్ద పెద్ద గోడను నిర్మించే పనిలో ఉన్నారు. కాగా కన్హయ్య బెయిల్ పిటిషన్‌పై సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది. ఫిబ్రవరి 24న జరిగిన విచారణలో కన్హయ్య లాయర్లు ఇచ్చిన వివరణపై జడ్జి విభేదించటంతో.. కేసు 29కి వాయిదా పడింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఆ పార్టీ నాయకులు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేయటంలో ప్రధాని విఫలమయ్యారని కాంగ్రెస్ విమర్శించింది.
జేఎన్‌యూ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని రాజ్యసభ విపక్షనేత గులాం నబీ ఆజాద్ అన్నారు. అఫ్జల్‌గురు ఉరితీతపై జరుగుతున్న వివాదంతో జేఎన్‌యూకు ఎలాంటి నష్టమూ జరగదని.. వర్సిటీ విద్యార్థుల ఆందోళనకు మేధావుల మద్దతుందని.. చరిత్రకారిణి రోమిలా థాపర్ అన్నారు. అప్రజాస్వామిక నియంత పాలన తప్ప.. మేధావుల ఆలోచనను ఎవరూ ఆపలేరన్నారు. దేశంలో విభజన సృష్టించేందుకు కేంద్రం మద్దతు తెలుపుతోందని బిహార్ సీఎం నితీశ్ కుమార్ విమర్శించారు. అయితే.. దేశాన్ని విభజించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కఠినచర్యలు తప్పవని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తమది బలహీన ప్రభుత్వం కాదని.. జాతివ్యతిరేక శక్తులపై ఉక్కుపాదం మోపుతామన్నారు. కాగా, రాజద్రోహం కేసులో జేఎన్‌యూ విద్యార్థి, జేఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షుడు అశుతోష్‌ను ఢిల్లీలోని ఆర్కేపురం స్టేషన్ పోలీసులు ఆదివారం రెండుసార్లు ప్రశ్నించారు. ఖాలిద్, అనిర్బన్‌లతో కలిసి అశుతోష్‌ను కార్యక్రమ నిర్వహణపైనే ప్రశ్నించారు.