సంచలన కేసులో నేడే వాదోపవాదాలు
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుకు సంబంధించి కోర్టులో విచారణ నేడు ప్రారంభంకానుంది. ముంబయి కోర్టులో ఈ విచారణ జరగనుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు షీనా బోరా తల్లి ఇంద్రాణి ముఖర్జియాతోపాటు ఆమె భర్త పీటర్ ముఖర్జియా, మాజీ భర్త సంజీవ్ ఖన్నా తరుపునుంచి వాదోపవాదాలు కోర్టు నేడు విననుంది. మరోపక్క, ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న ఇంద్రాణి డ్రైవర్ శ్యాంవర్ రాయ్ అప్రూవర్ గా మారి కీలక సాక్ష్యం ఇచ్చేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. అతడి తరుపునుంచి కూడా న్యాయవాది వాదనలు కోర్టు రికార్డు చేసుకోనుంది.
2012లో తన కూతురు అయిన షీనా బోరాను ఇంద్రాణి ముఖర్జియా దారుణంగా హత్య చేయించింది. స్వయంగా తాను కూడా ఈ హత్యలో పాల్గొన్నది. ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఇప్పటికే అందరిని విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేసి కోర్టుకు అందించింది. సీబీఐ చార్జిషీట్ ప్రకారం కుటుంబ ఆస్తి తగాదాల కారణంగానే షీనాని హత్య చేశారు. ఇంద్రాణి ఆమె మాజీ భర్తకు కలిగిన సంతానమే షీనా.
అయితే, మాజీ భర్త సంజీవ్ తో విడిపోయిన ఇంద్రాణి అనంతరం పీటర్ ముఖర్జియాను వివాహం చేసుకొంది. పీటర్ కొడుకు రాహుల్ కు తన కూతురును సొంత చెల్లిగా పరిచయం చేసింది. దీంతో అతడు షీనాతో సంబంధం పెట్టుకున్నాడు. ఇదంతా కూడా భవిష్యత్తులో ఆస్తి తగాదాలకు దారి తీస్తుందని, అసలుకే మోసం వస్తుందని గ్రహించిన ఇంద్రాణి పథకం ప్రకారం 2012 ఏప్రిల్ 24న హత్య చేసి ఆమె మృతదేహాన్ని రాయ్ గఢ్ లోని అటవీ ప్రాంతంలో పాతిపెట్టించగా పోలీసులు ఈ కేసును ఛేదించారు.