
గదిపై ముదిరిన రగడ!
* టీడీపీపీ కార్యాలయ బోర్డు తొలగించిన తృణమూల్
* స్పీకర్ తమకు ఇచ్చారని వెల్లడి
* ఆ గది 30 ఏళ్లుగా తమదేనంటున్న టీడీపీపీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో కార్యాలయాల కేటాయింపు వ్యవహారం తెలుగుదేశం, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. మంగళవారం టీడీపీపీ ఆఫీసులోకి ప్రవేశించిన తృణమూల్ ఎంపీలు దీన్ని స్పీకర్ తమకు కేటాయించినట్లు పేర్కొనటంతో వివాదం మొదలైంది. టీడీపీ వినియోగిస్తున్న ఐదో నంబర్ గదిని లోక్‌సభ స్పీకర్ గత ఆగస్టు 6న టీఎంసీకి కేటాయించారు. టీడీపీకి మూడో అంతస్తులోని గది కేటాయించారు. దీంతో కొందరు తృణమూల్ ఎంపీలు మంగళవారం ఐదో నంబర్ గది వద్దకు వచ్చి తమ పేర్లతో బోర్డులను ఏర్పాటు చేయించారు.
టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలోని బోర్డులను తొలగించారు. కార్యాలయాన్ని తమకు కేటాయిస్తున్నట్టు స్పీకర్ ఇచ్చిన ఆదేశాలను చూపుతూ కార్యాలయం లోపలికి వె ళ్లారు. మధ్యాహ్నం 2.30 గంటలప్పుడు భేటీ అయ్యారు. టీడీపీ కార్యాలయ సిబ్బంది అడ్డుకున్నా పట్టించుకోలేదు. టీడీపీపీ నేత సుజనాచౌదరి విషయం తెలిసి అక్కడకు చేరుకున్నారు. 30 ఏళ్లుగా ఇదే కార్యాలయాన్ని టీడీపీకి కేటాయిస్తున్నారని, గత రెండు లోక్‌సభల్లోనూ తమకు ఎంపీల సంఖ్య తక్కువగా ఉన్నా ఇదే కార్యాలయాన్ని కొనసాగించారంటూ వాగ్వాదానికి దిగారు. స్పీకర్ సూచించినట్లుగా 135, 136 గదులకు మారేందుకు అభ్యంతరం తెలిపారు. ఇరు పార్టీల నాయకులతో చర్చించి పరిష్కరిస్తామని స్పీకర్ హామీ ఇచ్చినట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి.