
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రచారం చేపట్టనున్నారు. తాను వారణాసిని సందర్శించి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని ఆమె సంకేతాలు పంపారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి తనను ఆహ్వానిస్తే తాను వారణాసిలో ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చారు. వారు (అఖిలేష్, మాయావతి) తనకు నైతిక బలం ఇచ్చే స్నేహితులని దీదీ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ను ఢీ కొట్టేందుకు విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేలా మమతా బెనర్జీ కొంత కాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 29న కోల్‌కతాలో మమతా బెనర్జీ నిర్వహించిన ర్యాలీలో 23 విపక్ష పార్టీల నేతలను ఆమె ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న మమత రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పాలక కూటమి ఓటమే లక్ష్యంగా ముందుకెళతానని పలు సందర్భాల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment