విలీనమా... పొత్తా?
కొనసాగుతున్న సందిగ్ధత
టీఆర్‌ఎస్ ముఖ్యులతో కేసీఆర్ చర్చలు
సోనియాతో భేటీ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం
జేఏసీ కొనసాగింపుపై తర్జనభర్జన
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్‌లో విలీనంపై తెలంగాణ రాష్ట్ర సమితిలో సందిగ్ధత నెలకొంది. విలీనమా? పొత్తా? విలీనమైతే ఎప్పుడు ప్రకటన చేయాలి? తెలంగాణలో సభను నిర్వహించాలా, అవసరం లేదా? అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ అంశాలపై చర్చించేందుకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్‌మెంట్‌ను కోరారని ఆయన సన్నిహితులు వెల్లడించారు. నేడో, రేపో సోనియా అపాయింట్‌మెంట్ దొరికే అవకాశాలున్నాయని, భేటీ తర్వాతనే స్పష్టత వస్తుందని చెబుతున్నారు.
అయితే విలీనం చేయాలని కేసీఆర్ సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారంటున్నారు. తెలంగాణ బిల్లు ఆమోదం కోసం సోనియాగాంధీ ప్రతిరోజూ ప్రత్యేకంగా పనిచేశారని, ఆమె దృఢంగా లేకుంటే రాష్ట్రం సాధ్యమయ్యేది కాదని టీఆర్‌ఎస్ ముఖ్యులతో కేసీఆర్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు అందుకు సంకేతమేనని చెబుతున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి అమరవీరుల స్మారకస్తూపం దాకా లక్ష మందితో భారీ ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఢిల్లీలో జరిగే పరిణామాలపైనే హైదరాబాద్‌కు తిరిగివెళ్లడం ఆధారపడి ఉందని పార్టీ నేతలు వెల్లడించారు.
టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి కష్టపడిన వారికి తగిన అవకాశాలు కల్పించాలంటే తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ అధికారాలు ఉంటేనే సాధ్యమని కేసీఆర్ భావిస్తున్నారు. దీనిపై ఏఐసీసీ నుంచి ఎలాంటి అంగీకారం, ప్రతిస్పందన రాలేదంటున్నారు.
కాంగ్రెస్‌లో విలీనమైతే కొందరు ముఖ్యులకు తప్ప చాలామందికి అన్యాయం జరుగుతుందని, విలీనం చేయవద్దని నియోజకవర్గ ఇన్‌చార్జీలు కోరుతున్నారు. ఇప్పటిదాకా కోట్ల రూపాయలు ఖర్చు చేసుకున్న తాము ఏమై పోవాలని కేసీఆర్ సన్నిహితుల వద్ద, కుటుంబసభ్యుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటిదాకా అన్ని కార్యక్రమాల్లో తమతో కలిసి పనిచేసిన జేఏసీ నేతలు కాంగ్రెస్ నేతలతో కలిసి సోనియాను కలవడంపై కేసీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని పార్టీ నేతలు వెల్లడించారు. జేఏసీ నేతలు టీఆర్‌ఎస్‌తో కలిసి లేరనే సంకేతాలను ఇవ్వడానికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నమని భావిస్తున్నారు.
తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో జేఏసీని కొనసాగించాలా? కొనసాగిస్తే ఎజెండా ఏముండాలి? అనే అంశాలపై కూడా తర్జనభర్జన జరుగుతోంది. లక్ష్యం సిద్ధించాక కొనసాగించాల్సిన అవసరంలేదని, పునర్నిర్మాణంలో అవసరమైన కార్యాచరణ ఎప్పటికప్పుడు రూపొందించుకుంటే సరిపోతుందని ప్రజాసంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఒకటి, రెండు రోజుల్లో స్టీరింగ్ కమిటీ సమావేశం పెట్టుకుని భవిష్యత్తుపై ఒక నిర్ణయం తీసుకోవాలని జేఏసీ భావిస్తోంది.