లక్నో: హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్, సీట్ బెల్ట్ ధరించకపోతే ఫైన్.. ముగ్గుర్ని ఎక్కించుకుని తిరిగావంటే.. దెబ్బకు దేవుడు గుర్తొచ్చేంత ఫైన్. ఇప్పుడు వీటి సరసన కొత్తగా చేరిన ఆంక్ష వింటే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఇప్పటికే జూలైలో పాసయిన నూతన మోటార్ వాహన చట్టం 2019తో వాహనదారులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఎప్పుడు ఏ వైపు నుంచి ఫైన్ మోత మోగుతుందో అని భయంతో వణికిపోతున్నారు. పెరిగిన జరిమానాలు ఆ రీతిలో ఉన్నాయి మరి! ఇవేవీ చాలవన్నట్టు కొత్తగా మరో ఆంక్షను అమల్లోకి తీసుకువచ్చింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. లుంగీలు ధరించి వాహనం నడిపితే పైసా వసూలు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ట్రక్ డ్రైవర్లు లుంగీ కట్టుకుని వాహనం నడిపిస్తూ కంటపడితే రూ.2000 జరిమానా విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. బనియన్, లుంగీల ధారణకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. లుంగీలకు బదులుగా ఫుల్ ప్యాంట్, బనియన్లకు బదులుగా టీషర్ట్స్ ధరించాలని కోరుతున్నారు. ఈ నియమం స్కూలు వాహనాలకు కూడా వర్తిస్తుందని యూపీ ట్రాఫిక్ ఏఎస్పీ పూర్నేందు సింగ్ పత్రికాముఖంగా వెల్లడించారు. ఈ కొత్త ఆంక్షల కోసం తెలిసిన జనాలు ఇదేం విడ్డూరం అని నోరెళ్లబెడుతున్నారు.
చదవండి: ఇప్పుడెలా వేస్తారు ట్రాఫిక్ చలానా!?
నూతన మోటార్ వాహన చట్టం అమల్లోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే చలానాల మోత మోగుతోంది దేశంలో. కొన్ని జరిమానాలు ఏకంగా రూ.80 వేలను దాటడం గమనార్హం. ఇక వాహనాలు నడిపేవారు చెప్పులు వేసుకోకూడదు అనే నియమం ఉన్నప్పటికీ అది ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు. దీన్ని ఉల్లంఘిస్తే రూ.1000 చెల్లించాలి. ట్రాఫిక్ ఆంక్షలను ఉల్లంఘించినవారికి కళ్లు తేలేసే జరిమానాలు విధిస్తున్నప్పటికీ ఏకకాలంలో సామన్యుల నడ్డి విరుస్తున్నారని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇక ఈ నిబంధనలతో నిద్రలోనూ ఉలిక్కిపడుతున్నారు లుంగీవాలాలు.
Comments
Please login to add a commentAdd a comment