హజి అలీ దర్గాలో ప్రవేశించిన తృప్తీ దేశాయ్
ముంబైః భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు, మహిళా హక్కుల ఉద్యమకారిణి తృప్తీదేశాయ్ ముస్లింల పవిత్ర క్షేత్రాలనూ వదల్లేదు. ప్రసిద్ధ ఆలయాల్లో మహిళల ప్రవేశంపై పోరాడి ఫలితాలను సాధిస్తున్న ఆమె..... తన మద్దతుదారులతో కలసి, తాజాగా ముంబైలోని హజీ అలీ దర్గాలో ప్రవేశించి సంచలనం రేపింది.
పలువురు మహిళా హక్కుల ఉద్యమకారులతో పాటు భారీ బందోబస్తుతో తృప్తి దేశాయ్...ముంబైలోని ముస్లిం పవిత్ర క్షేత్రం హజీ అలీ దర్గాలో ప్రవేశించారు. అనేక అడ్డంకులను అధిగమిస్తూ, సంప్రదాయ బంధనాలను తెంచుకొని ఆమె.. గురువారం ఉదయం దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. అయితే దర్గాలోని గర్భాలయంలోకి మాత్రం ఆమె ప్రవేశించలేదు. దర్గా ఆచారాలను అనుసరించి, ట్రస్ట్ సభ్యుల అనుమతితో, పోలీసు బందోబస్తుతో దర్గాలోకి ప్రవేశించిన తృప్తి... అక్కడ ప్రార్థనలు చేశారు. అయితే ప్రార్థనల అనంతరం బయటకు వచ్చిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 రోజుల్లోపు మరోసారి దర్గాలోని పురుషులు మాత్రమే ప్రవేశించే ముఖ్య ప్రాంతంలోకి ప్రవేశించి, అక్కడే ప్రార్థనలు జరుపుతామంటూ వ్యాఖ్యానించారు.
తృప్తి దేశాయ్, ఆమె మద్దతు దారులు, ఇంతకు ముందే ఓసారి దర్గాలోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా... పోలీసులు, స్థానిక ముస్లింలు వారిని అడ్డుకున్నారు. ప్రార్థనాలయాల్లో మహిళలకు అనుమతిపై లింగ వివక్షను విడనాడాలంటూ పోరాడుతున్న తృప్తి దేశాయ్... శనిసింగనాపూర్, త్రంయబకేశ్వర్ హిందూ ఆలయాల ప్రవేశం అనంతరం ముంబైలోని ప్రముఖ దర్గా ప్రవేశాన్ని ఎంచుకున్నారు. త్వరలోనే మహిళలను దర్గాలోని నిషేధ ప్రాంతానికి కూడ అనుమతిస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.