లక్నో : నాలుగు గోడల మధ్య బందీలుగా జైలు జీవితం గడపాల్సిన ఖైదీలు నానా హంగామా సృష్టించారు. యూపీలోని ఉన్నావ్ జైలులో కొందరు ఖైదీలు మద్యం సేవిస్తూ, బహిరంగ హెచ్చరికలు చేస్తూ..ఆయుధాలు చేపట్టిన వీడియోలు కలకలం రేపాయి. ఈ ఘటనకు సంబంధించి నలుగురు అధికారులను యూపీ ప్రభుత్వం బదిలీ చేసింది. వీడియోలో నానా రచ్చ చేసిన ఖైదీలను వేరే జైళ్లకు బదలాయించారు.
బహిర్గతమైన వీడియోల్లో ఓ ఖైదీ ఏకంగా తుపాకీని చూపుతూ ‘మీరట్ జైలు లేదా ఉన్నావ్ జైలు..జైలు ఏదైనా తాను ఇలాగే ఉంటానని, జైలు లోపల వెలుపల ఎవరినైనా హతమారుస్తా’ అంటూ రెచ్చిపోయాడు. మరో ఖైదీ హిందీ సినిమాలో డైలాగ్ వల్లెవేస్తూ తనపై ఏ ఒక్కరూ చర్య తీసుకునే ధైర్యం చేయబోరని చెప్పుకొచ్చాడు. తాను దేవ్ ప్రతాప్ సింగ్‌నని చెబుతూ అధికారులకే సవాల్ విసిరాడు.
తనకు జైలు అంటే కార్యాలయమేనని, ఏ జైలులో అయినా తాను దర్జాగా బతికేస్తానని ఈ ఖైదీ చెప్పడం గమనార్హం. ఖైదీల వీరంగంపై యూపీ జైళ్ల మంత్రి జై కుమార్ సింగ్ స్పందిస్తూ ఈ ఉదంతంపై డీఐజీ విచారణకు ఆదేశించారని, నలుగురు అధికారులపై శాఖాపరమైన విచారణ ప్రారంభమైందని, వారిని వేరే ప్రాంతానికి బదిలీ చేశామని చెప్పారు. వీడియోలో వీరంగం వేసిన ఇద్దరు ఖైదీలను వేరే జైళ్లకు తరలించామని వివరణ ఇచ్చారు. కాగా ఖైదీలు చూపిన తుపాకులు నిజమైనవి కావని అవి ఆటవస్తువులని జైలు అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment