ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బండీపూరలోని హంజన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ, పోలీసు బలగాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న సమయంలో అక్కడే నక్కిన ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఆ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు ఉండొచ్చన్న సమాచారంతో తనిఖీలు కొనసాగుతున్నాయి.
సోమవారం పూంచ్, రాజౌరి జిల్లాలలో పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటంతో ఓ పౌరుడు గాయపడ్డాడని అధికారులు వెల్లడించారు. బొసానీ గ్రామంలో అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి ఇంటిపై మోటార్ షెల్స్ పడటంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. బీఎస్‌ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రాయ్ సింగ్ సైతం పాక్ కాల్పుల్లో గాయపడ్డాడని అధికారులు వెల్లడించారు.