bandipora
-
బంగారంలాంటి బాక్సర్.. తజముల్
అది బుధవారం..టీవీలో కిక్‌బాక్సింగ్ వస్తోంది. ‘ఏంటబ్బా! ఇది!’ అని ఆశ్చర్యంగా చూసింది ఎల్కేజీ చదువుతోన్న చిన్నారి. కాసేపు చూశాక ‘‘అక్కా! ఏంటిది?’’ అని అడిగింది. ‘‘ఇదా.. కిక్‌బాక్సింగ్’’ అంది అక్క. ‘‘అవునా ఇది చాలా బావుంది. నేనుకూడా ఇలా కిక్ బాక్సింగ్ చేస్తాను’’ అంది. అది విన్న తోబుట్టువులంతా ఏదో చిన్న పిల్ల అంటోందిలే అనుకున్నారు. కానీ ఆ చిన్నారి మాత్రం ఆ మాట చాలా సీరియస్‌గానే అంది. కిక్‌బాక్సింగ్ మీద ఆసక్తి ఏర్పడడంతో ప్రతి బుధ, శని, ఆదివారాలలో ప్రసారమయ్యే కిక్‌బాక్సింగ్‌ను క్రమం తప్పకుండా చూసేది. అవి చూస్తూ తను కూడా ఎలాగైనా అలా టీవీలో కనిపించేంతగా కిక్‌బాక్సింగ్‌లో రాణించాలనుకుంది. కొన్ని రోజుల గడిచాక ఉండబట్టలేక ‘‘అమ్మా! నేను కిక్‌బాక్సింగ్ నేర్చుకుంటాను’’ అని అమ్మను అడిగింది. ఆ చిన్నారి ఆతృత గమనించిన తల్లి ‘‘అసలు నీకు కిక్‌బాక్సింగ్ గురించి ఏం తెలుసు? అందులో దెబ్బలు తగులుతాయి’’ అని చెప్పింది. ‘‘లేదు, నేను నొప్పిని ఓర్చుకుని ఎలాగైనా బాక్సింగ్ నేర్చుకుంటాను’’ అంది. అమ్మలానే నాన్న కూడా ‘‘వద్దు’’ అన్నారు కానీ, పట్టువదలని విక్రమార్కుడిలా కిక్‌బాక్సింగ్ నేర్చుకునేందుకు అమ్మానాన్నలని ఒప్పించింది తజముల్ ఇస్లాం. కశ్మీర్‌కు చెందిన ఈ చిన్నారి అలా పట్టుదలతో కిక్‌బాక్సింగ్ నేర్చుకోవడమేగాక, ప్రపంచ కిక్‌బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన తజముల్ తాజాగా రెండోసారి ప్రపంచ కిక్ బాక్సింగ్ చాంపియన్‌షిప్–21 అండర్ –14 కేటగిరిలో గోల్డ్ మెడల్ సాధించి భారతీయులు గర్వపడేలా చేయడమేగాక, ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. బందిపొర జిల్లాలోని తారకపొర అనే కుగ్రామంలోన ఓ నిరుపేద కుటుంబంలో తజముల్ ఇస్లాం జన్మించింది. గులాం మహ్మద్ ఐదుగురు సంతానంలో తజముల్ నంబర్ మూడు. డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు తండ్రి. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ.. తన చిన్నారి ఆసక్తిని కాదనలేదు మహ్మద్. తజముల్ కోరికను నెరవేర్చేందుకు కిక్‌బాక్సింగ్‌లో కోచ్ వద్ద శిక్షణ ఇప్పించారు. మొదట్లో సాధన కష్టంగా ఉన్నప్పటికీ, రోజురోజుకీ దృఢంగా తయారై ఉదయం, సాయంత్రం మొత్తం మీద ఐదుగంటలపాటు శ్రమించి, కిక్‌బాక్సింగ్‌ను అవపోసన పట్టింది తజముల్. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో పోటీ పడి చాంపియన్‌గా నిలుస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి కిక్‌బాక్సర్‌గా ఎదిగింది. తొలి గోల్డ్‌మెడల్.. 2016లో తజముల్ ప్రపంచస్థాయి కిక్‌బాక్సింగ్ చాంపియన్‌షిప్‌కు ఎంపికైంది. ఇటలీలో జరిగే ఈ పోటీలకు వెళ్లడానికి తన దగ్గర డబ్బులు లేవు. ఆ సమయంలో కశ్మీర్లో స్పాన్సర్ చేసేవారు ఎవరూ లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. అదే సమయంలో ఆర్మీస్కూల్లో చదువుతోన్న తజముల్ మాష్టారు ఒకరు..విషయం తెలిసి తను ఇటలీ వెళ్లి పాల్గొనడానికి కావాల్సిన ఖర్చును పెట్టుకుంటానని ముందుకొచ్చారు. అంతేగాక ఆర్మీఫెడరేషన్ మరికొంత సాయం చేయడంతో అండర్–9 చాంపియన్‌షిప్‌లో పాల్గొని స్వర్ణపతకం సాధించింది. అప్పటిదాక సబ్‌జూనియర్ స్థాయిలో అంతర్జాతీయ గోల్డ్ మెడల్ భారత్‌కు ఒక్కటీ లేదు. తొలిగోల్డ్ మెడల్ సాధించిన భారతీయురాలుగా తజముల్ నిలిచింది. స్పోర్ట్స్ అకాడమీ.. ‘‘నువ్వు చిన్నాచితకా మెడల్స్ సాధించడం కాదు. ఇటువంటి మెడల్స్‌ను నేను షాపులో కూడా కొనుక్కొస్తాను. నువ్వు గోల్డ్ మెడల్ తీసురావాలి’’ అంటూ ఆమెలో పట్టుదలను రేకెత్తించాడు తండ్రి. నాన్న మాట నిలబెట్టడంతో తజముల్ ఇటలీ నుంచి ఇండియా వచ్చేటప్పటికీ తజముల్ పేరుమీద స్పోర్ట్స్ అకాడమీకి రిజిస్ట్రేషన్ చేసిన పేపర్లను తజముల్కు ఇచ్చారు. ప్రస్తుతం ఈ అకాడమీలో ఐదు నుంచి ఆరు ఏళ్ల వయసు పిల్లలు దాదాపు వందమంది దాక శిక్షణ తీసుకుంటున్నారు. బందిపొరాలో అమ్మాయిలకు క్రీడలపై శిక్షణ ఇచ్చే సంస్థలు పెద్దగా లేవు. తజముల్కు గోల్డ్ మెడల్ వచ్చాక, అమ్మాయిలకు ప్రత్యేక స్పోర్ట్స్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. డాక్టర్ అవుతా.. ప్రస్తుతం ఆర్మీ గుడ్‌విల్ స్కూల్లో ఏడోతరగతి చదువుతోన్న 13 ఏళ్ల తజముల్ భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో పాల్గొని మెడల్ సాధించడమే లక్ష్యమంటోంది. ‘‘వార్మప్స్, కిక్స్, పంచ్‌ల సాధన ద్వారా రోజురోజుకి మెరుగవడమే కాదు.. గోల్డ్‌మెడల్స్ కూడా సాధించగలిగాను. భవిష్యత్‌లో మంచి ఎముకల సర్జన్‌ని అవుతాను. ఎందుకంటే కిక్ బాక్సింగ్‌లో చాలా మంది ఎముకలు విరగ్గొడుతుంటాను కాబట్టి వాళ్లందరికీ శస్త్రచికిత్స చేసి సరిచేస్తాను’’ అని చెబుతోంది తజముల్ నవ్వుతూ. తండ్రితో తజముల్ -
జమ్మూ కశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
సాక్షి, శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. బండిపోర జిల్లాలో పనార్ అటవీ ప్రాంతంలో ఉగ్ర కదలికలపై అందిన సమాచారంతో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఆ ప్రాంతంలో తలదాచుకున్న మరికొందరు ఉగ్రవాదుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ ఆర్మీ జవాన్ చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు తెలిపారు. సీఆర్పీఎఫ్, రాష్ర్టీయ రైఫిల్స్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మరోవైపు మిగిలిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుండటంతో మరణించిన ఉగ్రవాదులు ఎవరనేది నిర్ధారించలేదు. కాగా బుధవారం సాంబ సెక్టార్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిన ఘటనలో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు మరణించగా, మరో ముగ్గురు గాయపడిన విషయం తెలిసిందే. -
ఎన్కౌంటర్లో 5మంది ఉగ్రవాదుల హతం
సాక్షి, శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లోని బందిపూర్ ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ఉగ్రవాదులపై పై చేయి సాధించాయి. హజిన్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 5 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టు పెట్టాయి. ఈ విషయాన్ని జమ్ము కశ్మీర్ డీజీపీ కూడా ధృవీకరించారు. చనిపోయిన ఉగ్రవాదుల్లో ఎన్కౌంటర్లో 26/11 ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి జకీర్ ఉర్ రెహమాన్ లఖ్వీ మేనల్లుడు కూడా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మృతి చెందిన ఉగ్రవాదులంతా లష్కరే తోయిబాకు చెందిన వారని భద్రతా బలగాలు ప్రకటించాయి. ఒక ఐఏఎఫ్ కమాండర్ కూడా అమరుడైనట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. లష్కరే తోయిబాలో చేరిన కశ్మీర్ ఫుట్‌బాల్ ప్లేయర్ తిరిగి జనజీవన స్రవంతిలోకి చేరిన కొన్ని గంటల్లోనే భద్రతాబలగాలు ఉగ్రవాదులను ఏరివేయటం చర్చనీయాంశంగా మారింది. -
ఉగ్రవాదుల చేతిలో జవాన్ దుర్మరణం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బందిపొరా జిల్లాలోని హజ్జాన్‌లో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కానిస్టేబుల్ రమీజ్ అహ్మద్ పర్రే ఇంట్లోకి బుధవారం చొరబడ్డ ఉగ్రవాదులు.. అయన్ను సమీపం నుంచి కాల్చిచంపారు. ఈ దాడిలో రమీజ్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయన కుటుంబ సభ్యులు నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. రమీజ్ అహ్మద్ పర్రే ఇంట్లోకి చొరబడ్డ ఉగ్రవాదులు విచాక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. రమీజ్ కొద్ది రోజుల క్రితమే సెలవులపై ఇంటికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మే 10వ తేదీన ఓ పెళ్లి వేడుకకు హాజరైన ఆర్మీ లెఫ్టినెంట్ మేజర్ ఉమర్ ఫయాజ్ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. -
సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రదాడి
-
సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై ఉగ్రదాడి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బందీపొర జిల్లాలోని సీఆర్పీఎఫ్ క్యాంప్‌పై సోమవారం తెల్లవారుజామున దాడికి పాల్పడ్డారు. వివరాలు.. సంబల్‌లోని 45వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ క్యాంప్‌ను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ముందుగా సెంట్రీ పోస్ట్‌పై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు కౌంటర్ ఎటాక్ చేపట్టాయి. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి వద్ద నుంచి ఏకే 47 తుపాకులతో పాటు ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మాహుతి దాడికి పాల్పడే ప్రణాళికతో ఉగ్రవాదులు క్యాంప్‌పై దాడి చేశారని అధికారులు తెలిపారు. కశ్మీరులో ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చుతున్నారనే ఆరోపణలతో పాకిస్తాన్‌కు చెందిన నేతలు, వ్యాపారుల సంస్థలు, నివాసాలలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం. -
మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బందిపొరా జిల్లాలోని హజిన్ ప్రాంతంలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడ్డారు. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు కాగా.. భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు పర్రే మొహల్లా ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. -
ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బండీపూరలోని హంజన్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ, పోలీసు బలగాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న సమయంలో అక్కడే నక్కిన ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఆ ప్రాంతంలో మరికొందరు ఉగ్రవాదులు ఉండొచ్చన్న సమాచారంతో తనిఖీలు కొనసాగుతున్నాయి. సోమవారం పూంచ్, రాజౌరి జిల్లాలలో పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడటంతో ఓ పౌరుడు గాయపడ్డాడని అధికారులు వెల్లడించారు. బొసానీ గ్రామంలో అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి ఇంటిపై మోటార్ షెల్స్ పడటంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ రాయ్ సింగ్ సైతం పాక్ కాల్పుల్లో గాయపడ్డాడని అధికారులు వెల్లడించారు.