ముంబై : కోవిడ్-19 నియంత్రణలను ప్రజలు పాటించని పక్షంలో లాక్‌డౌన్‌ను తిరిగి విధించాల్సి వస్తుందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. కరోనా మహమ్మారిపై క్షేత్రస్ధాయి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోందని, సడలింపులు ముప్పుగా మారాయని వెల్లడైతే మరోసారి లాక్‌డౌన్ తప్పదని స్పష్టం చేశారు.లాక్‌డౌన్ సడలింపులతో మహమ్మారి ముప్పు తీవ్రతరమైందని వెల్లడైతే లాక్‌డౌన్‌ను తిరిగి విధించేందుకు వెనుకాడబోమని, ప్రజలు దయచేసి ఒకచోట గుమికూడరాదని ఠాక్రే ట్వీట్ చేశారు.
మహారాష్ట్రలో దశలవారీగా లాక్‌డౌన్‌ను విధించడంతో పాటు దశలవారీగా ఎత్తివేస్తున్నామని, అయితే ప్రమాదం ఇంకా ముంగిటే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాతో పోరాడుతూ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయలేమని వ్యాఖ్యానించారు. ప్రజల ప్రయోజనం కోసమే తాము పనిచేస్తున్నామని మహారాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకున్నందునే వారు సహకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 94,041కు పెరగ్గా 3438 మంది మరణించారు. కరోనా వైరస్ నుంచి ఇప్పటివరకూ 44,517 మంది కోలుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment