మాఫియా డాన్ చోటా రాజన్ అరెస్ట్
బాలిలో అదుపులోకి తీసుకున్న ఇండోనేసియా పోలీసులు
► ఆస్ట్రేలియా నుంచి బాలికి వస్తుండగా విమానాశ్రయంలోనే అరెస్ట్
► ఈ వారంలోనే భారత్‌కు తరలింపు!
► ఇండోనేసియా అధికారులతో భారత దర్యాప్తు సంస్థల సంప్రదింపులు
► దావూద్ ఇబ్రహీంకు పోటీగా ఎదిగిన గ్యాంగ్‌స్టర్ రాజన్
► ముంబై నేర సామ్రాజ్యంపై పట్టు కోసం డీ కంపెనీకి సవాలు...
► 'చోటా'హత్యకు దావూద్ పలు విఫలయత్నాలు
► రాజన్ అరెస్ట్ గొప్ప విజయం: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ/జకార్తా
అండర్‌వరల్డ్ డాన్, గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్(55) అరెస్టయ్యాడు. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో ఇండోనేసియాలోని ప్రముఖ పర్యాటక ద్వీపం బాలిలో ఆ దేశ పోలీసులు ఆదివారం చోటా రాజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి బాలికి వచ్చిన రాజన్‌ను ఆస్ట్రేలియా పోలీసులిచ్చిన సమాచారంతో బాలి విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. ఈ వారమే ఆయనను భారత్‌కు తరలించనున్నారు. భారత్- ఇండోనేసియాల మధ్య నేరస్తుల అప్పగింతకు సంబంధించిన ప్రత్యేక ఒడంబడిక లేనప్పటికీ.. రాజన్ తరలింపులో ఎలాంటి సమస్య ఎదురుకాబోదని భారతీయ అధికారులు భావిస్తున్నారు. రాజన్‌ను భారత్‌కు తీసుకువచ్చేందుకు దౌత్యపరమైన అనేక మార్గాలున్నాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకడైన రాజన్ మరో ప్రముఖ డాన్ దావూద్ ఇబ్రహీంకు ఒకప్పుడు కుడిభుజం.. దావూద్ డీ కంపెనీలో నంబర్ 2. 1993 ముంబై పేలుళ్ల అనంతరం దావూద్‌కు, డీ కంపెనీకి ప్రధాన ప్రత్యర్థిగా మారాడు.
ముంబైలో దావూద్ నేర సామ్రాజ్యాన్ని సవాలు చేశాడు. అప్పట్నుంచీ రాజన్‌ను హతమార్చేందుకు దావూద్ పలుమార్లు విఫల యత్నాలు చేశాడు. పరారీలో ఉన్న చోటా రాజన్ అలియాస్ రాజేంద్ర సదాశివ నికల్జే అలియాస్ మోహన్ కుమార్ అలియాస్ నానా కోసం భారత్ గత రెండు దశాబ్దాలుగా గాలిస్తోంది. ఆయనపై 20కి పైగా హత్యాకేసులు, డ్రగ్స్ దందా, స్మగ్లింగ్, బలవంతపు వసూళ్లు, అక్రమంగా ఆయుధాలు కలిగిఉండటం సహా అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రాజన్ విషయంలో సహకరించాల్సిందిగా ఇంటర్‌పోల్‌తో పాటు పలు దేశాలకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. 1995లోనే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే బాలీలో రాజన్‌ను అరెస్ట్ చేశారు. చోటా రాజన్ అరెస్ట్ వార్తను ఇండోనేసియా పోలీసులు, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీబీఐ డెరైక్టర్ అనిల్ సిన్హా ధ్రువీకరించారు. రాజన్ అరెస్ట్ గొప్ప విజయమని రాజ్‌నాథ్ అభివర్ణించారు. గుర్తింపు, పరిశీలన తదితర చట్టపరమైన ప్రక్రియ అనంతరం తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. సీబీఐ, ఇతర భారతీయ దర్యాప్తు సంస్థలు ఇండోనేసియా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయన్నారు. రాజన్ అరెస్ట్‌లో చొరవ చూపిన ఇంటర్‌పోల్‌కు, ఇండోనేసియా అధికారులకు రాజ్‌నాథ్ కృతజ్ఞతలు తెలిపారు.
భారత్ తదుపరి లక్ష్యం 1993 ముంబై పేలుళ్ల ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రహమేనా అన్న మీడియా ప్రశ్నకు 'భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూద్దాం' అంటూ బదులిచ్చారు. రాజన్ అరెస్ట్ విషయమై ఆస్ట్రేలియా అధికారులతో చాలాసార్లు సంప్రదింపులు జరిపామని, భారత్, ఆస్ట్రేలియా, ఇండోనేసియాల సమష్టి కృషి, పరస్పర సహకారంతోనే రాజన్ అరెస్ట్ సాధ్యమైందని సీబీఐ అధికార ప్రతినిధి దేవ్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. రాజన్‌పై అత్యధిక కేసులు ముంబైలోనే నమోదై ఉన్నాయని, ఆయనను భారత్‌కు తరలించిన అనంతరం రాష్ట్రానికి తీసుకువచ్చే విషయమై కేంద్రాన్ని అభ్యర్థిస్తామని మహారాష్ట్ర హోంమంత్రి రామ్ షిండే తెలిపారు. రాజన్ మారు పేరుతో, వేరే ధ్రువపత్రాలతో గత ఏడేళ్లుగా కట్టుదిట్టమైన వ్యక్తిగత భద్రతాసిబ్బంది రక్షణలో ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. రాజన్ ఆస్ట్రేలియాలో ఉంటున్న విషయాన్ని ఆదేశ ఫెడరల్ పోలీస్ గత నెలలో ధ్రువీకరించిందని, ఈ విషయమై భారతీయ అధికారులతో సంప్రదింపులు జరిపిందని బాలి పోలీస్ అధికార ప్రతినిధి హేరీ వియంటో వెల్లడించారు. ప్రస్తుతం రాజన్‌ను బాలి పోలీస్ ప్రధాన కార్యాలయంలో విచారిస్తున్నట్లు తెలిపారు. అరెస్ట్ సమయంలో రాజన్ వద్ద మోహన్‌కుమర్ పేరుతో పాస్‌పోర్ట్ ఉందన్నారు.
ఆ ఒప్పందం కీలకం
ఇండోనేసియాతో ఇటీవల కుదిరిన ఒక ఒప్పందం రాజన్ తరలింపులో కీలకంగా మారనుంది. ఇరుదేశాల నుంచి కోర్టు వారంటుతో నేరస్తుల తరలింపు సాధ్యమయ్యే అవకాశం ఆ ఒప్పందంతో లభిస్తుంది. ఇరుదేశాల్లోని పరారీలో ఉన్న నిందితుల తరలింపుతో పాటు నేరపరమైన అంశాల్లో పరస్పర సహకారం అందించుకోవాలని ఆ ఒప్పందంలో పేర్కొన్నారు. ఆ ఒప్పందంపై ఈ ఆగస్ట్‌లోనే సంతకాలు జరిగాయి. అనంతరం ఆగస్ట్ 21న ఆ ఒప్పందాన్ని భారత్ ప్రభుత్వం దీన్ని నోటిఫై చేసింది.
ఇండియాకు తీసుకువచ్చేంతవరకు అనుమానమే..!
రాజన్‌ను భారత్‌కు తీసుకువచ్చేంతవరకు తనకు అనుమానమేనని ముంబైలో క్రిమినల్ గ్యాంగ్‌ల పనిపట్టిన అధికారి, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ ఎంఎన్ సింగ్ వ్యాఖ్యానించారు. తన గత అనుభవాల ఆధారంగా అలా అనుమానిస్తున్నానన్నారు. 2000 సంవత్సరంలో బ్యాంకాక్‌లో రాజన్‌పై దాడి జరిగి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తాను, మహారాష్ట్ర హోంమంత్రి చగన్ భుజ్‌బల్ నాటి కేంద్ర విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్‌ను కలిసి, రాజన్‌ను భారత్‌కు తీసుకువచ్చే విషయంలో చొరవ చూపాలని కోరి న విషయాన్ని సింగ్ గుర్తు చేసుకున్నారు. రాజన్‌ను విచారించడం ద్వారా వ్యవస్థీకృత నేర సామ్రాజ్యం, రాజకీయ నేతలు, పోలీసుల మధ్య నెలకొని ఉన్న రహస్య సంబంధాలు వెల్లడయ్యే అవకాశముందని ముంబైలో పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి వైపీ సింగ్ వ్యాఖ్యానించారు. 2011లో హత్యకు గురైన సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ క్రైం రిపోర్టర్ జ్యోతిర్మయి డే కేసు విషయంలో, 2010లో దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కాస్కర్‌పై హత్యాయత్నం కేసు విషయంలోనూ పురోగతి సాధ్యమవుతుందన్నారు. జ్యోతిర్మయి డేను రాజన్ ఆదేశాల మేరకే హత్య చేశారని ఆరోపణలున్నాయి. రాజన్‌కు ఆర్థికంగా సహకరించిన ముంబైలోని బిల్డర్ల వివరాలు వెల్లడవుతాయని సింగ్ పేర్కొన్నారు.