రాజన్ కోసం భారత బృందం
ఇండోనేసియా వెళ్లిన సీబీఐ, పోలీసు అధికారులు
న్యూఢిల్లీ/బాలి: మాఫియా డాన్ చోటా రాజన్‌ను భారత్‌కు తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. అతణ్ని తీసుకువచ్చేందుకు సీబీఐ, ముంబై, ఢిల్లీ పోలీసుల బృందం ఆదివారం ఇండోనేసియా వెళ్లింది. మరోవైపు.. బాలి జైల్లో ఉన్న రాజన్‌తో జకార్తాలోని భారత ఎంబసీ కార్యదర్శి సంజీవ్ కుమార్ భేటీ అయ్యారు. రాజన్ అరెస్టు తర్వాత భారత ఉన్నతాధికారి అతణ్ని కలవడం ఇదే తొలిసారి. ఇండోనేసియాతో నేరగాళ్ల అప్పగింత ఒప్పందం లేకపోవడంతో భారత అధికారులు.. రాజన్‌ను తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. రాజన్ భారతీయుడని చెప్పే పత్రాలను ఇప్పటికే అక్కడి అధికారులకు అందజేశారు.
రాజన్‌పై ముంబైలో 75, ఢిల్లీ లో 6 కేసులు ఉన్నాయి. ముంబైలో 20 హత్య కేసులున్నాయి. రాజన్‌ను భారత్‌కు రప్పించగానే.. సీబీఐ అతడిని ముంబై పోలీసులకు అప్పగించనుంది.