సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ బుధవారం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని అక్రమ కాలనీలను రెగ్యులరైజ్ చేస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఢిల్లీలోని నివసిస్తున్న 40 లక్షల మందికి నేరుగా ప్రయోజనం చేకూరనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది.
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనం
ఇక, నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌లను గట్టెక్కించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రెండు సంస్థలను విలీనం చేసి.. పూర్వవైభవం తీసుకురావాలని నిర్ణయించింది. బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌లను మూసివేయబోమని కేంద్ర మంత్రి రవిశంకర్ తెలిపారు. ఆ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఉండబోదని ఆయన చెప్పారు. ఈ సంస్థలను తిరిగి గాడిలో పెట్టేందుకు 4జీ స్పెక్ట్రమ్ కేటాయించడంతోపాటు రూ. 15వేల కోట్ల సావరీన్ బాండ్స్ జారీచేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ రెండు సంస్థల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటుకు అప్పగించే ప్రసక్తే లేదని చెప్పారు.
పంటల కనీస మద్దతు ధర పెంపు
కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. గోధుమ సహా మరికొన్ని పంటల కనీస మద్ధతు ధర పెంచుతున్నట్టు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment