ఆధార్ కార్డుల క్లోనింగ్...పది మంది అరెస్ట్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ప్రత్యేక పోలీసు అధికారుల దళం నకిలీ బయోమెట్రిక్ ఆధార్ కార్డులను రూపొందిస్తున్న పది మంది సభ్యుల ముఠాను పట్టుకుంది. ముఠా సభ్యులు ఆధార్ కార్డు దరఖాస్తు ఫారమ్‌ను ముద్రించడం కోసం సెక్యూరిటీ సోర్స్ కోడ్‌ను హ్యాక్ చేయడంతోపాటు ఆధార్ కార్డును మంజూరు చేసే అధికారుల వేలిముద్రలను కూడా క్లోనింగ్ చేయడం విశేషం. దీని కోసం వారు గెలాటిన్ జెల్, లేజర్, సిలికాన్‌లను ఉపయోగించారు.
అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలతోపాటు పాన్, బ్యాంక్‌ల ఖాతాలకు, ఫోన్ నెంబర్లకు ఆధార్ కార్డును ప్రభుత్వం ముడిపెడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆందోళనకరమైన అంశం. నోడల్ అథారిటీ యూఐడీఏఐ అర్హులైన ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లకు జారీ చేసిన లాగిన్ వివరాలను కూడా ఈ హ్యాకర్లు సేకరించాగలిగారని స్పెషల్ టాస్క్ ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తున్న అదనపు పోలీసు సూపరింటెండెంట్ త్రివేణి సింగ్ మీడియాకు తెలిపారు.

ఈ ముఠా సభ్యులు క్లైంట్ అప్లికేషన్ ఫామ్ ప్రతిని, క్లోనింగ్ చేసిన వేలి ముద్రలను అక్రమ కార్యకలాపాల కోసం ఐదు వేల రూపాయలకు చొప్పున విక్రయిస్తున్నారని త్రివేణి సింగ్ వివరించారు. రెటీనా స్కానింగ్‌ను కూడా ఈ ముఠా సభ్యులు క్లోనింగ్ చేస్తున్నారని ఆయన తెలిపారు. తమ దాడిలో నకిలీ వేలి ముద్రలను, రెటీనా స్కానర్లను, సాఫ్ట్‌వేర్‌ను స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. ఈ మొత్తం నకిలీ వ్యవహారంలో యూఐడీఏఐ అధికారుల హస్తం ఉందని తాము అనుమానిస్తున్నామని, వారి ప్రమేయం లేకుండా ఉన్నత సాంకేతిక ప్రమాణాలుగల దరఖాస్తును కాపీ చేయడం, సోర్స్ కోడ్‌ను పట్టుకోవడం సాధ్యం కాదని ఆయన అన్నారు. బయోమెట్రిక్ పద్ధతులను ఉపయోగించకుండానే ఆధార్ సర్వర్‌లోకి లాగిన్ అయ్యే సాఫ్ట్‌వేర్‌ను ఈ ముఠా సభ్యులు సృష్టించారని, అది అన్నింటికన్నా ఆందోళనకరమైన అంశమని త్రివేణి సింగ్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఈ ముఠా సభ్యులు ఎంతమంది ఆధార్ వివరాలను ప్రాసెస్ చేశారన్న అంశాన్ని మరింత లోతుగా పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు.

ఉన్నత సాంకేతిక ప్రమాణాలు కలిగిన ఆధార్ దరఖాస్తులను కాపీ చేసుకోవడం, బయోమెట్రిక్ పద్ధతుల్లో రికార్డయిన వేలి ముద్రలు, కనుగుడ్డులోని ఛారలను క్లోనింగ్ చేయడం దురదష్టకరమైన పరిణామమేనని, అన్నింటికి లింక్ చేస్తున్న ఆధార్ కార్డుకే భద్రత లేకుండా పోతుందని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఆధార్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.