ఇంగ్లిష్ మార్కులను పరిగణించం!
సివిల్స్ సీశాట్ 2 పరీక్ష విధానంలో మార్పునకు ప్రభుత్వం ఆమోదం
లోక్‌సభలో ప్రకటించిన కేంద్రమంత్రి జితేంద్రసింగ్
శాంతించని అభ్యర్థులు; పేపర్ 2ను పూర్తిగా తొలగించాలని డిమాండ్
ఆగస్టు 24ననే ప్రిలిమ్స్: యూపీఎస్సీ;
వాయిదా వేయాలంటున్న అభ్యర్థులు
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష వివాదం ముదురుతుండటంతో ప్రభుత్వం ఒక మెట్టు దిగింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ‘సీశాట్(సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్)’ రెండో పేపర్‌లోని ఇంగ్లిష్ విభాగంలో అభ్యర్థులకు వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకోబోమని సోమవారం ప్రకటించింది. అయితే, తాము సీశాట్ విధానంలో మార్పులను కోరడం లేదని, మొత్తంగా ఆ పేపర్‌ను తొలగించాలన్నది తమ డిమాండ్ అని గత 25 రోజులుగా ఆందోళనలు చేస్తున్న సివిల్స్ అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, ప్రభుత్వం ప్రకటించిన మార్పులను చేర్చి ముందు ప్రకటించినట్లుగానే ప్రిలిమినరీ పరీక్షను ఈ నెల 24ననే నిర్వహిస్తామని యూపీఎస్సీ స్పష్టం చేసింది. ‘‘ సీశాట్ పేపర్ 2 లోని ‘ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్’ విభాగంలోని మార్కులను మెరిట్ నిర్ధారణలో పరిగణనలోకి తీసుకోరాదని ప్రభుత్వం భావిస్తోంది’’ అని కేంద్ర సిబ్బంది శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ సోమవారం లోక్‌సభలో ప్రకటించారు. అలాగే, 2011లో సివిల్స్ పరీక్ష రాసినవారికి 2015లో మరో అవకాశమిస్తామని కూడా వెల్లడించారు. సీశాట్ పేపర్ 2ను తొలగించడం, ప్రిలిమ్స్ పరీక్షను రద్దుచేయడం.. ఈ డిమాండ్లతో ఇప్పటివరకు ముఖర్జీ నగర్‌లో ఆందోళన నిర్వహిస్తున్న అభ్యర్థులు.. తమ నిరసన స్థలాన్ని సోమవారం జంతర్‌మంతర్‌కు మార్చారు.
పార్లమెంటులో రభస..
ఈ అంశాన్ని పార్లమెంటు ఉభయసభల్లోనూ ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తారు. రాజ్యసభలో గందరగోళం చెలరేగి సభ ఒకసారి వాయిదా పడింది. జితేంద్రసింగ్ ప్రకటన రాజ్యసభలో ప్రతిపక్ష కాంగ్రెస్, సీపీఐ, డీఎంకే, తృణమూల్, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ, జేడీయూ పార్టీల సభ్యులను శాంతింపచేయలేదు. సివిల్స్ అభ్యర్థులు ఈ పరీక్షను తమ మాతృభాషలో రాసే అవకాశముందా? లేదా? అనే విషయంలో ప్రభుత్వం స్పష్టతనివ్వాలని వారు డిమాండ్ చేశారు. సీశాట్ వివాద పరిష్కారానికి నిర్దేశిత గడువు విధించాలని డిమాండ్ చేశారు. కాగా, నేపాల్ పర్యటన నుంచి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సీనియర్ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సహాయ మంత్రి జితేంద్రసింగ్‌లు ఈ అంశంపై తాజా పరిణామాలను వివరించారు.