ఫినాయిల్ కాదు.. గోనాయిల్ మేలు
న్యూఢిల్లీ: ఇక నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేసేందుకు ఫినాయిల్కు బదులు సహజసిద్ధంగా తయారుచేసిన గోనైల్ వాడాలని కేంద్ర స్త్రీ-శిశు సంక్షేమ శాఖామంత్రి మేనక గాంధీ సూచిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, మరుగుదొడ్లను శుభ్రం చేయడానికి ప్రస్తుతం వాడుతున్న ఫినాయిల్ వల్ల వాతావరణానికి హాని కలుగుతుందని..దీనికి ఆవు మూత్రం మంచి ప్రత్యామ్నాయమని ఆమె అన్నారు.
కెమికల్స్తో కూడిన ఫినాయిల్కు బదులుగా ఆవు మూత్రం నుండి తయారుచేసిన సహజ క్రిమిసంహారిణి(గోనాయిల్)ను వాడాలని ఆమె తన శాఖ ఉద్యోగులను కోరారు. ఈ గోనాయిల్ రోగక్రిమినాశినే కాకుండా వాతావరణానికి ఎలాంటి నష్టం కలిగించకుండా ఎకో ఫ్రెండ్లీగా ఉంటుందని మేనకాగాంధీ తెలిపారు. హోలీ కౌ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ గౌనాయిల్ విరివిగా తయారు చేస్తోందనీ, సింథటిక్ బేస్ తో ఉన్న ఫినాయిల్ కంటే గోనాయిల్ చాలా సమర్ధవంతంగా పని చేస్తుందని మంత్రి చెబుతున్నారు.
ఆయుర్వేద వైద్య విధానాలు, హిందూ సాంప్రదాయాల్లో ఆవుకున్న ప్రాధాన్యతను గురించి నొక్కి వక్కాణించిన వారిలో మేనకాగాంధీ ఒక్కరే కాదు మరో కేంద్రమంత్రి కూడా ఉన్నారు. దేశవ్యాప్తంగా నూతన ఆరోగ్య పాలసీ అమల్లోకి రానున్నట్టు ..ఆయుష్ వైద్య విధానాలకు అధిక ప్రాథాన్యత ఇవ్వనున్నట్లు ఆయుష్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ పాదనాయక్ గతంలోనే ప్రకటించారు. ఆయుర్వేదిక్ కంపెనీలు తయారుచేస్తున్న మందులను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. ఆవు నుండి లభించే పాలు, పెరుగు నెయ్యి,మూత్రం, పేడ లాంటి అయిదు పదార్థాలతో తయారుచేసి పంచగవ్యలో ఎన్నో ఔషధ విలువలున్నాయన్నారు.