సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. నడుస్తున్న కారులో ఓ విదేశీ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ ఉదంతం జరిగింది.
ఉజ్బెకిస్థాన్ కు చెందిన మహిళ షాపింగ్ కోసం వసంతకుంజ్ ప్రాంతానికి వెళ్లారు. అనంతరం తిరిగి ఆటోలో ఇంటికి బయలుదేరారు. మార్గ మధ్యంలో ఆటోలో సాంకేతిక లోపం తలెత్తడంతో, ఆటో డ్రైవర్ వేరే వాహనం చూసుకోమని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో మరో వాహనం కోసం బాధితురాలు ఎదురు చూస్తుండగా.. సుమారు పది నిమిషాల అనంతరం వేరే వాహనంలో వచ్చిన గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని, కారులోనే వివిధ ప్రాంతాల్లోకి తిప్పుతూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఖిర్కీ ఎక్స్ టెన్షన్ ప్రాంతంలో ఆమెను వదిలివెళ్లారు.
బాధితురాలి ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.