వారఫలాలు(17 డిసెంబర్‌ నుంచి 23 డిసెంబర్‌ 2017 వరకు) | varaphalalu inthis week | Sakshi
Sakshi News home page

వారఫలాలు(17 డిసెంబర్‌ నుంచి 23 డిసెంబర్‌ 2017 వరకు)

Published Sun, Dec 17 2017 12:50 AM | Last Updated on Sun, Dec 17 2017 12:50 AM

varaphalalu inthis week - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. పాతబాకీలు వసూలవుతాయి. మీ ఊహలు నిజం చేసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. జీవితాశయం నెరవేరుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. గులాబి, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ  చేయండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఎంతటి కార్యాన్నైనా చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు రాగలవు. వాహనాలు, స్థలాలు కొంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకర్షిస్తుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. కళాకారులకు సన్మానాలు. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఆకుపచ్చ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ పూజలు చేయండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులలో అవాంతరాలు తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం కాగలవు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఇతరులకు సైతం సహాయపడతారు. ఆస్తుల వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపారాలలో అనుకూలస్థితి, పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగాలలో ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు అందుతాయి. విద్యార్థులకు శుభవర్తమానాలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. గులాబీ, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అదనపు రాబడి ఉంటుంది. అనుకున్న పనులు సాఫీగా పూర్తి కాగలవు. సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు సమస్యలు తొలగుతాయి.  రాజకీయవర్గాలకు పదవీయోగం. షేర్ల విక్రయాలలో అధిక లాభాలు. పసుపు, లేతనీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, స్నేహితుల నుంచి శుభవర్తమానాలు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆశయాల సాధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగి ముందుకు సాగుతారు. కళాకారులకు సన్మానాలు. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు. షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం. ఎరుపు, లేత గులాబి రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
వ్యయప్రయాసలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకున్న లక్ష్యాలు సాధించే వరకూ విశ్రమించరు. ఆర్థిక వ్యవహారాలో చిక్కులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ సత్తా చాటుకునేందుకు తగిన సమయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. కళాకారులు, పారిశ్రామికవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. పనులు నిదానంగా సాగుతాయి. బంధువర్గంతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆలోచనల అమలులో ప్రతిబంధకాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కొంత పెరుగుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు ఉండవచ్చు. కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. షేర్ల విక్రయాలు సామాన్యంగా లాభిస్తాయి. నలుపు, నీలం రంగులు. దక్షిణదిÔ¶  ప్రయాణాలు.  ఆదిత్య హృదయం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు కొంత తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాలలో ఆటుపోట్లు తొలగుతాయి. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు కోరుకున్న బదిలీలు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది. షేర్ల విక్రయాలలో లాభాలు. గులాబి, తెలుపు రంగులు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
మీలోని ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి.  వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. వ్యాపారాలు విస్తరించడంలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది. కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. గులాబి, పసుపు రంగులు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్య సూచనలు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. కొన్ని కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. ఆకుపచ్చ, లేత పసుపు రంగులు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
వీరిని విజయాలు వరిస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. ధార్మిక కార్యక్రమాలు చేపడతారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు రాగలవు. కళాకారులకు విశేష ఆదరణ. షేర్ల విక్రయాలలో లాభాలు.  వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబసభ్యుల వైఖరిలో అనుకూల మార్పు కనిపిస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రి మెంట్లు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి. వారం ప్రారంభంలో ధననష్టం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

 టారో (17 డిసెంబర్‌ నుంచి  23 డిసెంబర్, 2017 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
గత కొద్దికాలంగా మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేసిన పరిస్థితులన్నీ నెమ్మదిగా సర్దుకుంటాయి. జీవితంలో మంచి రోజులన్నవి ఈవారం నుంచే మొదలవుతాయి. కొత్తగా ఆలోచిస్తారు. ఎప్పట్నుంచో అనుకుంటున్న మీకిష్టమైన పని ఒకటి మొదలుపెడతారు. సొంతంగా ఒక్కరే అన్ని భారాలనూ మీద వేసుకొని పని చేసే మీ స్వభావం కాస్తంత మారాల్సి ఉంది. కొత్త వ్యక్తి పరిచయమవుతారు. ఆ వ్యక్తితో కలిసి నూతన వ్యాపారం మొదలుపెట్టే ఆలోచన చేస్తారు. ప్రేమ జీవితం అహ్లాదకరంగా ఉంటుంది.
కలిసివచ్చే రంగు : గులాబి

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
అదృష్టం బాగా కలిసివస్తుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తున్నారన్న ఆలోచన మిమ్మల్ని బాధపెడుతుంది. వృత్తి జీవితంలో కొన్ని అనుకోని ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ ముందుకెళ్లండి. మీరు ఊహించని ఓ అవకాశం తలుపుతడుతుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండండి. మీరు బాగా ఇష్టపడే వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. 
కలిసివచ్చే రంగు : పసుపు 

మిథునం (మే 21 – జూన్‌ 20)
మీకు బాగా దగ్గరైన వ్యక్తితో కలిసి ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టే ఆలోచన చేస్తారు. ఈ ఆలోచన మంచిదే అన్న విషయాన్ని నమ్మి, ధైర్యంగా ముందుకు వెళ్లండి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా మెరుగుపడుతుంది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. అవతలి వ్యక్తిని అర్థం చేసుకోవడంలో ఇంకా వెనకబడి ఉన్నారేమో ఆలోచించుకోండి. ఆ ఆలోచన చేస్తే ఇక మీ ప్రేమ జీవితం మళ్లీ అద్భుతంగా ఉంటుందన్న విషయం మరవకండి.  
కలిసివచ్చే రంగు : వయలెట్‌ 

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఈవారం మీకు కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి. మీరు ఇష్టంగా ప్రేమించే వ్యక్తితో మనస్ఫర్థాలు తలెత్తుతాయి. సామరస్యంగా ఈ సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి. ఆ వ్యక్తి మీ జీవితానికి ఎంత అవసరమో గ్రహించి, వారికి దూరం కాకుండా ఉండేందుకు ఏమేం చేయాలో అన్నీ చేయండి. ఈ నెలాఖర్లో ఎప్పట్నుంచో ఊరిస్తోన్న విజయం వరిస్తుంది. రుద్రాక్ష మాల ధరించి కొత్త ఉత్తేజం పొందండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 
కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ 

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఈవారం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అయితే ఇప్పటికీ ఇంకా కుదురుకోనట్లైతే ఆ నిర్ణయాలను వాయిదా వెయ్యడమే మంచిది. కొద్దిరోజుల పాటు ప్రశాంతంగా ఉంటూ, మీ జీవితానికి ఏది సరైనదో గ్రహించి, ఆ నిర్ణయమే తీసుకోండి. తొందరపడొద్దు. కొన్నాళ్లపాటు మీరు అనుకున్నవేవీ జరగకపోవచ్చు కూడా. అయితే ఇదంతా తాత్కాలికమేనని, ఈ సమయం దాటిపోతే ఇక అంతా మంచే జరుగుతుందన్న విషయాన్ని బలంగా నమ్మండి. 
కలిసివచ్చే రంగు : నారింజ 

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఈవారం ఒక శుభవార్త వింటారు. ఈ వార్త మీకు నూతనోత్సాహాన్నిస్తుంది. మీ భయాలను తుంచుకొని అందరితో కలిసిపోయే స్వభావాన్ని అలవర్చుకోవాల్సిన సమయం ఇదే. మీలో రావాల్సిన ఈ మార్పే మిమ్మల్ని కొత్త విజయాలవైపుకు తీసుకెళుతుంది. కొంతకాలం మీకు పరిస్థితులన్నీ అనుకూలించినట్టే ఉంటూ కొన్ని సమస్యలను తీసుకొస్తాయి. వీటన్నింటికీ ఏవిధంగానూ జంకకుండా ధైర్యంగా నిలబడండి. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. 
కలిసివచ్చే రంగు : నారింజ 

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
మీకు ముందున్నంతా మంచి కాలమే.  ఎప్పట్నుంచో కోరుకున్న కోరికలూ ఇప్పుడే నెరవేరి జీవితానికే కొత్త వెలుగు వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ విజయాలకు తోడు కొత్త అవకాశాలూ మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అయితే ఆ అవకాశాల్లో మీకు బాగా సంతృప్తినిచ్చే వాటినే ఎంపిక చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఇష్టంగా ప్రేమించే వ్యక్తితో విహారయాత్రకు వెళ్లే ఆలోచన ఉంటే అందుకు ఇదే సరైన సమయం. 
కలిసివచ్చే రంగు : నీలం 

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఏడాది చివర్లో ఓ శుభవార్త వింటారు. మీరు ఎప్పుడో మొదలుపెట్టిన ఓ పని ఇప్పుడే ఫలితాలనివ్వడం మొదలుపెడుతుంది. కొత్త అవకాశాలు కూడా వరుసగా వచ్చి పడతాయి. జీవితాశయం వైపుకు మిమ్మల్ని నడిపించే అవకాశాలను మాత్రం అందిపుచ్చుకోండి. ఒక కొత్త వ్యక్తి పరిచయం మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఫలితం గురించి ఆలోచించకుండా ఎప్పట్నుంచో చేయాలనుకుంటున్న ఓ పనిని మొదలుపెట్టేందుకు ఇదే సరైన సమయం.
కలిసివచ్చే రంగు : బూడిద 

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఆర్థిక పరిస్థితి కొంత కలవరపెడుతుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం అలవాటు చేసుకోండి. వృత్తిజీవితం ఎప్పట్లానే బాగుంటుంది. ఉన్నత పదవిని అలంకరిస్తారు. కొత్త బాధ్యతలు చేపడతారు. మీ శక్తినంతా వెచ్చించి పనిచేయండి. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకునేందుకు, ఆ వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే. తాత్విక ఆలోచనలు మిమ్మల్ని కొద్దిరోజులు బాగా వెంటాడతాయి. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కూడా త్వరలోనే దక్కుతుంది. 
కలిసివచ్చే రంగు : ఊదా 

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఈవారం మీకు అంతా మంచే జరుగుతుంది. అలాగే ఈ నెల్లోనే జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. ఎప్పట్నుంచో దీనికి సన్నాహాలు చేసుకున్నా, ధైర్యంగా మీకు ఏమేం అవసరమో వాటిని నిర్ణయించుకొని ముందుకెళ్లండి. ప్రేమ జీవితం ఊహించనంత ఆహ్లాదకరంగా ఉంటుంది. విహారయాత్రలకు కూడా సన్నాహాలు చేస్తారు. అసలు ఖాళీ సమయం అన్నదే లేకుండా పనుల్లో మునిగిపోతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
వృత్తి జీవితం చాలా బాగుంటుంది. కొత్త బాధ్యతలతో ఖాళీ సమయం అన్నదే లేకుండా కష్టపడతారు. అయితే మీకు రావాల్సిన గుర్తింపు ఇప్పటికీ దక్కడం లేదన్న బాధ మాత్రం మిమ్మల్ని బాధపెడుతుంది. ఆత్మవిశ్వాసంతో, విజయంపై ధీమాతో కష్టపడి పనిచేయండి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు వస్తుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఇష్టపడే వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆ వ్యక్తి మీకో ప్రత్యేక బహుమతి కూడా అందిస్తారు. 
కలిసివచ్చే రంగు : పసుపు 

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఒక ప్రత్యేక వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తి పరిచయం మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మిమ్మల్ని మీరే కొత్తగా ఆవిష్కరించుకుంటారు. ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న విజయం కూడా త్వరలోనే మీకు దగ్గరగా వస్తుంది. ఆలోచనా విధానం మారడం వల్ల కూడా కొత్త అవకాశాలను సొంతం చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతంలోకంటే చాలా మెరుగవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తిజీవితం అంతా సాఫీగా సాగిపోతుంది. 
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 
ఇన్సియా టారో అనలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement