పాక్ బంకర్లు ధ్వంసం!
భారత బలగాల దాడి
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖవెంబడి ఉన్న పాకిస్తాన్ బంకర్లను భారత బలగాలు ధ్వంసం చేసినట్లుగా చూపిస్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమంలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. అయితే, గతవారం జమ్మూ సరిహద్దుల్లో ఇద్దరు భారత జవాన్ల తలలు తెగనరికిన ఘటనకు ముందే ఈ దాడి జరిగినట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత ఆర్మీ ట్యాంకులు, యాంటీ–ట్యాంక్ మిసైల్‌ల ద్వారా పాక్ బంకర్లను పూర్తిగా ధ్వంసం చేస్తున్నట్లు ఈ వీడియోల్లో స్పష్టమైంది.
ఈ వీడియోలో భారత జవాన్ల మాటలు (భావిస్తున్నారు) వినిపించాయి. మిసైల్‌లు వరుసగా బంకర్లను ధ్వంసం చేయగానే జవాన్లు మాట్లాడుకున్న ‘ట్యాంక్ కా (షెల్) లగ్ గయా, గిరాదియా (షెల్ లక్ష్యాన్ని తాకింది, పడగొట్టేసింది). హాజీ, హాజీ (అవునవును)’ అని వినిపించింది. మరో బంకరు ధ్వంసం కాగానే.. ‘ ఆగయా ట్యాంక్ కా.. ఏక్‌బా ఆగయా (షెల్ అనుకున్న పని పూర్తిచేసింది)’ అని హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎక్కడ ఈ దాడి జరిగిందనేది స్పష్టంగా వెల్లడికాలేదు. అయితే.. గతనెల్లో (ఏప్రిల్)లో ఈ పాక్ బంకర్ల విధ్వంసం జరిగి ఉండొచ్చని మరికొందరు భావిస్తున్నారు.