
వివాదంలో వీకే సింగ్
మాజీ సైనికాధిపతి జనరల్ వీకే సింగ్ చుట్టూ వివాదం ముసురుకుంది. జమ్మూకాశ్మీర్‌లోని ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఆయన ప్రయత్నించారని ఆరోపణలు వెలువడ్డాయి.
కాశ్మీర్‌లో ఒమర్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి యత్నించారని ఆరోపణలు
అనధికార సంస్థ ద్వారా నిధులు దుర్వినియోగపరిచారని ఆర్మీ రహస్య నివేదిక
సీబీఐ విచారణను తోసిపుచ్చలేమన్న కేంద్ర ప్రభుత్వం
ఆరోపణలను ఖండించిన వీకే సింగ్
న్యూఢిల్లీ: మాజీ సైనికాధిపతి జనరల్ వీకే సింగ్ చుట్టూ వివాదం ముసురుకుంది. జమ్మూకాశ్మీర్‌లోని ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఆయన ప్రయత్నించారని ఆరోపణలు వెలువడ్డాయి. ఇందుకోసం ఆయన ఒక అనధికార సంస్థను ఏర్పాటు చేశారని, దీని ద్వారా ఒమర్ సర్కారును అస్థిరపరచడానికి నిధులు దుర్వినియోగం చేశారని ఆర్మీ ఒక రహస్య నివేదికను కేంద్రానికి సమర్పించినట్టు జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై స్పందించిన కేంద్రం ఈ వ్యవహారంలో బాధ్యులుగా తేలిన అధికారులు పదవిలో కొనసాగుతున్నా.. లేదా పదవీ విరమణ చేసినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అత్యంత సున్నితమైన ఈ అంశంపై సీబీఐ విచారణ కోరే అవకాశాలను తోసిపుచ్చలేమని కేంద్ర మంత్రి మనీష్ తివారీ వ్యాఖ్యానించారు. అయితే ఈ వివాదం కాస్తా కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.
ఆర్మీ రహస్య నివేదిక ప్రకారం వివాదాస్పద టెక్నికల్ సర్వీస్ డివిజన్(టీఎస్‌డీ) అనధికార కార్యకలాపాలు నిర్వహిస్తోందని, నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని తేలింది. ఒమర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు యత్నించడంతో పాటు తన తర్వాత ఆర్మీ చీఫ్‌గా బిక్రమ్‌సింగ్ రాకుండా అడ్డుకునేందుకు ఒక ఎన్‌జీవోకు నిధులు సమకూర్చినట్టు, అనధికార కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించేందుకు వీకే సింగ్ యత్నించినట్టు వెల్లడించింది. ఈ నివేదికను డెరైక్టర్ జనరల్(మిలిటరీ ఆపరేషన్స్) లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా రూపొందించారు. ఈ నివేదికను ఈ ఏడాది మార్చిలో రక్షణ శాఖకు సమర్పించిన ఆర్మీ అధికారులు.. దీనిపై సీబీఐలాంటి అత్యున్నత సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరినట్టు తెలిసింది. అయితే ఈ నివేదికకు సంబంధించిన వ్యవహారం శుక్రవారం జాతీయ పత్రికల్లో రావడంతో వివాదం చెలరేగింది.
టీఎస్‌డీకి సంబంధించిన నివేదికపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని రక్షణ శాఖ స్పష్టం చేసింది. రక్షణ విభాగంలో ఎటువంటి అవాంఛనీయ కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నించారంటూ వచ్చిన వార్తలను వీకే సింగ్ తోసిపుచ్చారు. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు కోసం చేస్తున్న దుష్ర్పచారమని కొట్టిపారేశారు. తాను మోడీతో కలిసి వేదిక పంచుకోవడం కొంత మందికి నచ్చలేదని అందువల్లే తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.