
న్యూఢిల్లీ: ఓటు ధ్రువీకరణ యంత్రాల(వీవీప్యాట్)తో అనుసంధానం చేసిన ఈవీఎంలు ఓటు వేసే సమయంలో ఓటర్లను ఫొటోలు తీయబోవని, వీటిపై ప్రచారమవుతున్న అవాస్తవాలను నమ్మవద్దని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ‘వీవీప్యాట్ ఈవీఎం మిషన్లు ఓటు వేసే సమయంలో ఫొటోలు తీస్తాయి. మీరు మా నుంచి డబ్బులు తీసుకుని ఓటు వేయకపోతే మాకు తెలుస్తుంది. మీరు మమ్మల్ని మోసం చేయలేరని కొందరు రాజకీయ నాయకులు ఓటర్లను భయపెడుతున్నారు. ఇవి పూర్తిగా అవాస్తవాలు. వీటిని నమ్మవద్దు’అని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ వివరించారు. వీవీప్యాట్ మిషన్లు ఈవీఎంతోపాటు ఉంటాయని, ఓటరు ఓటు వేసిన వెంటనే తాను ఎంపిక చేసుకున్న అభ్యర్థి పేరు, గుర్తు వీవీప్యాట్ పరికరం నుంచి చిన్న పేపర్‌పై ప్రింట్ అయ్యి బయటకు వస్తాయని చెప్పారు. ఆ పేపరు సుమారు 7 సెకన్లపాటు ఓటరుకు కనిపించి.. అక్కడే ఉన్న బాక్స్‌లోకి వెళుతుందని తెలిపారు.