'లక్ష రూపాయలకు నా భార్యను అమ్మేస్తా'
- ఫేస్‌బుక్‌లో ఓ ప్రబుద్ధుడి నిర్వాకం
ఇండోర్: ప్రపంచమంతా మహిళా దినోత్సవం జరుపుకొంటున్న సందర్భంలోనే మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఓ వికృత ఘటన చోటుచేసుకుంది. అప్పుల పాలైన ఓ 30 ఏళ్ల వ్యక్తి.. వాటిని తీర్చుకోవడానికి తన భార్యను అమ్మడానికి సిద్ధమయ్యాడు. లక్ష రూపాయలు ఇస్తే తన భార్యను అమ్మేస్తానంటూ ఏకంగా ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. అతని నిర్వాకంతో నివ్వెరపోయిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె భర్త దిలీప్ మాలిపై ఐపీసీ సెక్షన్ 509 (మాటలు, చర్యలు, చేష్టలతో మహిళలను కించపరచడం) ఎరోద్‌రోమ్ పోలీసు స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
నిందితుడు దిలీప్ సింగ్ తన భార్య, రెండేళ్ల కూతురు ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఆ పోస్టులో తన ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు. తన భార్యను అమ్మాలనుకుంటున్నాని హిందీలో ఈ పోస్టులో పేర్కొన్నాడు. 'వేర్వేరు వ్యక్తుల వద్ద నేను తీసుకున్న అప్పులు తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నా. అందుకే నా భార్యను లక్ష రూపాయలకు అమ్మేస్తాను. ఎవరైనా కొనేందుకు ఆసక్తిగా ఉంటే నా ఫోన్ నంబర్‌కు సంప్రదించండి' అని అతడు తన పోస్టులో పేర్కొన్నాడు.
తన బంధువుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అతని భార్య షాక్ తింది. తనను, తన కుటుంబసభ్యులను అవమానపరిచేందుకు అతను ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దిలీప్ మాలితో ఆమెకు మూడేళ్ల కిందట పెళ్లయింది. వివాహం అనంతరం ఈ జంట ఇండోర్‌లో స్థిరపడింది. అక్కడ తెలిసినవారందరి దగ్గరా అప్పులు చేసిన దిలీప్.. వాటిని తీర్చలేక తన పూర్వీకుల ఊరికి పరారయ్యాడు. దీంతో చేసేదేమీ లేక తాముంటున్న అద్దె ఇంటిని ఖాళీ చేసి అతని భార్య, రెండేళ్ల కూతురు తమ తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు.