సీఎంగారూ నీళ్లు ఇలా వృథా చేస్తారా?
ఆ ప్రాంతం కరువుతో అల్లాడిపోతున్నది. తాగడానికి కూడా గుక్కెడు నీళ్లు లేక జనం నానా అవస్థలు పడుతున్నారు. కరువు తాండవిస్తున్న అలాంటి ప్రాంతంలో సమీక్ష నిర్వహించడానికి ముఖ్యమంత్రి వస్తున్నారనేగానే.. ఆయన హెలిప్యాడ్ కోసం అధికారులు వేలలీటర్ల నీటిని వృథా చేసేశారు. ట్యాంకర్ల కొద్ది నీటి ఉపయోగించి హెలిప్యాడ్ సిద్ధం చేశారు. కరువు పీడిత ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో సీఎం అఖిలేశ్ యాదవ్ పర్యటన సందర్భంగా ఇలా నీటిని దుబరా చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్న బుందేల్‌ఖండ్ లోని లలిత్‌పూర్‌లో ప్రజలకు కరువు సహాయం ఏమేరకు అందుతున్నదో సమీక్షించడానికి సీఎం అఖిలేశ్ పర్యటన సందర్భంగా ఈ హెలిప్యాడ్‌ను అధికారులు ఏర్పాటుచేశారు. ఈ వివాదంపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. గుక్కెడు నీళ్లు లేక ప్రజలు చస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడింది. సీఎం అఖిలేశ్ తీరు చాలా అసంబద్ధంగా ఉందని, నీటిని ఇలా వృథా చేయడంపై సీఎం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేత రితా బహుగుణ డిమాండ్ చేశారు. హెలిప్యాడ్ కోసం నీటి వృథా అంశంపై సీఎం క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుండగా.. అధికార ఎస్పీ మాత్రం ఆ అవసరం లేదంటోంది. హెలిప్యాడ్ సిద్ధం చేసే బాధ్యత సెక్యూరిటీ అధికారులదని, దానిపై సీఎం ఎలా క్షమాపణ చెప్తారని ప్రతిపక్షాలను ప్రశ్నిస్తోంది. కరువు పీడిత లాతూరులో మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ కోసం 10వేల లీటర్ల నీటిని వృథా చేయడం ఇప్పటికే దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.