భగ్గుమంటున్న అబ్బాయి, బాబాయ్ల వివాదం
భగ్గుమంటున్న అబ్బాయి, బాబాయ్ల వివాదం
Published Mon, Dec 26 2016 11:40 AM | Last Updated on Sat, Sep 15 2018 8:28 PM
సమాజ్వాద్ అధికార పార్టీ ఇంట నెలకొన్న రాజకీయ సంక్షోభం, సీట్ల పంపకం విషయంలో మళ్లీ తారాస్థాయికి వెళ్తోంది. టిక్కెట్ల పంపిణీల్లో బాబాయి శివ్పాల్ యాదవ్, అబ్బాయి అఖిలేష్ యాదవ్ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. టిక్కెట్ల విషయంలో బెంగ పడొద్దని ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చిన అఖిలేష్, 403 మంది అభ్యర్థులతో కూడిన సొంత జాబితాను తయారుచేసి బాబాయి శివ్పాల్కు పంపించారు.
అయితే ఆ జాబితాపై శివపాల్ అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలుస్తోంది. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారికి టిక్కెట్ ఇచ్చే ప్రసక్తే లేదని శివ్ పాల్ తేల్చిచెప్పినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ జాబితాలోనే బుందేల్ ఖండ్లోని రెండు స్థానాల నుంచి తాను పోటీచేయనున్నట్టు అఖిలేష్ తెలిపారు. బబినా, మహోబ నుంచే అఖిలేష్ పోటీచేస్తున్నారని రిపోర్టులు తెలిపాయి.
ఉత్తరప్రదేశ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపక బాధ్యతలను రాష్ట్ర పార్టీ చీఫ్ శివ్పాల్ నిర్వహిస్తున్నారు. ఈ పంపక విషయంలో తనకు ఇష్టంలేని వారికి, క్రిమినల్స్కు బాబాయ్ టిక్కెట్లు ఇస్తారని అఖిలేష్ గుర్రుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనకిష్టమైన వారితో సొంత జాబితా సిద్ధం చేసి శివ్పాల్కు పంపించారు. కానీ అఖిలేష్ పంపిన జాబితాపై శివ్పాల్ అసంతృప్తి వ్యక్తంచేయడం మళ్లీ వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో చిచ్చు రేపుతోంది.
Advertisement
Advertisement