
మేం రైతులకు మిత్రులం
సాక్షి, బెంగళూరు: భూ సేకరణ బిల్లుపై ప్రతిపక్షాలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని.. తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ఆశిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ‘రైతులంటే నాకు సానుభూతి ఉంది. వారి కష్టాలను అర్థం చేసుకున్నాను. రైతులను సాధికారం చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని పేర్కొన్నారు. బెంగళూరులో శుక్రవారం ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సదస్సులో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన మోదీ.. సాయంత్రం స్థానిక నేషనల్ కాలేజ్ మైదానంలో జరిగిన పార్టీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. భూసేకరణ బిల్లును ప్రస్తావించకుండానే.. అది రైతుల వ్యతిరేకమంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై దాడి ఎక్కుపెట్టారు.
‘అసత్యాలను ప్రచారం చేస్తున్న వారికి.. రైతుల ప్రయోజనాలను కాపాడటం ఎలాగో తెలియదు. రైతులు తమ భూమిని ఎలా కోల్పాయారు? ఆ భూమి ఎక్కడికి వెళ్లింది? వారి పిల్లలకు ఒక గుమాస్తా ఉద్యోగం కోసమో.. లేదా వారిని డ్రైవర్లుగా తయారు చేయటం కోసమో.. లంచాలు ఇవ్వటానికి వారు తమ భూములను అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని గత) ప్రభుత్వాలు తెచ్చాయి’ అని గత యూపీఏ సర్కారు, దాని సారథి కాంగ్రెస్‌ను విమర్శించారు. రైతులకు రొట్టెముక్కలు విసిరేయటం వల్ల వారికి ఒరిగేదేమీ ఉండదని.. వ్యవసాయ రంగంలో సంస్కరణలు అవసరమని పేర్కొన్నారు. నీతి, నిజాయితీలే అండగా ముందుకు సాగితే దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడం సాధ్యమేనని పది నెలల్లోనే నిరూపించామన్నారు. దేశంలోని యువతకు విస్తృత ఉపాధి అవకాశాలను చేరువ చేయడమే లక్ష్యంగా మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదాన్ని తీసుకొచ్చామన్నారు.
గ్యాస్ సబ్సిడీని వదులుకునేందు ముందుకొచ్చే ప్రతి ఒక్కరి స్థానంలో, ఇంట్లో కట్టెల పొయ్యితో ఇబ్బంది పడుతున్న ఒక్కో నిరుపేద మహిళకు గ్యాస్ కనెక్షన్‌ను అందజేస్తామన్నారు. గ్యాస్ సబ్సిడీని వదులుకునే ఉద్యమాన్ని.. స్వచ్ఛ భారత్, బేటీ బచావో-బేటీ పడావో ఉద్యమాల తరహాలో చేపట్టాలని ఉద్బోధించారు. విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కు తెస్తామన్న హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందంటూ.. దీనిపై చేపట్టిన చర్యలను వివరించారు. ఈ బహిరంగ సభలో పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
అనుకూలమని చెప్పాలి: అమిత్ షా
భూసేకరణ బిల్లుపై ప్రతిపక్షం అసత్యప్రచారం చేస్తోందని.. దానిని తిప్పికొట్టేందుకు ఆ బిల్లు రైతులకు అనుకూలమైనదనే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని బీజేపీ తన శ్రేణులకు పిలుపునిచ్చింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సదస్సు బెంగళూరులోని లలిత్ అశోకా హోటల్‌లో ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ప్రారంభోపన్యాసం చేస్తూ.. భూసేకరణ చట్టానికి చేసిన సవరణల్లో రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకమైనది ఏమీ లేదని పార్టీ శ్రేణులు గర్వంగా చెప్పుకోవచ్చన్నారు. ‘బిల్లుపై ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగా అసత్యాలు చెప్తోంది. అది రైతుల ప్రయోజనాలకు ఉద్దేశించినది. ఈ సందేశాన్ని మనం రైతుల వద్దకు తీసుకువెళతాం.
బీజేపీ అనేది రైతుల మిత్రపక్షం. మనకు అధికారాన్నిస్తూ తీర్పు చెప్పింది రైతులు. విపక్షంలోని వారు దేనినైనా వెదకాలనుకుంటే వారి నేతను వెదికేందుకు ప్రయత్నించాలి’ అంటూ సెలవులో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని అమిత్‌షా పరోక్షంగా ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరినీ పార్టీ కార్యకర్తలుగా మార్చేందుకు ‘మహాసంపర్క్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న 9.25 కోట్ల మందిలో 15 లక్షల మందిని ఎంపిక చేసి పార్టీ కార్యక్రమాలపై శిక్షణ ఇస్తామన్నారు.
మోదీ విదేశాంగ విధానం భేష్...
సదస్సులో వేదికపై మోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, సీనియర్ నేత ఎల్.కె.అద్వానీలు ఆసీనులయ్యారు. 111 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు, ప్రత్యేకాహ్వానితులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఆయా రాష్ట్రాల పార్టీ చీఫ్‌లు హాజరయ్యారు. ఉగ్రవాదం-చర్చలు కలసి సాగవని.. పాకిస్తాన్‌తో భారత సంబంధాలు వ్యూహాత్మక ప్రాధాన్యాల ఆధారంగా ఉంటాయని, విదేశాంగ విధానంపై ఈ సదస్సులో ప్రవేశపెట్టిన తీర్మానంలో బీజేపీ పేర్కొంది. మోదీ విదేశాంగ విధానంలో గౌరవం, చర్చలు, భద్రత, ఉమ్మడి సుసంపన్నత, సంస్కృతి అనే పంచామృతం మూల స్తంభాలుగా ఉన్నాయంది.